Rupee Value: రూపాయి విలువ పడిపోతుంది. రోజురోజుకు తన విలువను మరింత కోల్పోతోంది. గత రెండు సంవత్సరాల నుంచి తీవ్ర ఆటు పోట్లు ఎదుర్కొంటున్న రూపాయి.. జీవితకాల కనిష్టానికి చేరుకోవడం ఆర్థికవేత్తలను నివ్వెర పరుస్తోంది. జీ _20 సమావేశాలు జరుగుతున్న వేళ భారత కరెన్సీ విలువ పడిపోతుండడం ఒకరకంగా మన దేశానికి ఇబ్బందే. అంతర్జాతీయంగా పరిస్థితులు బాగోలేదని పైకి చెప్పినప్పటికీ.. సామాన్య జనానికి అవి అంతగా అర్థం కావు.
వరుస గా నాలుగో రోజూ..
భారత కరెన్సీ.. సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోతోంది. గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 10 పైసలు పతనమై 83.22 వద్ద ముగిసింది. డాలర్ బలోపేతం, గరిష్ఠ స్థాయి ముడి చమురు ధరలు ఇందుకు కారణమయ్యాయని ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో పయనించడం రూపాయి పతనానికి కొంత మేర అడ్డుకట్ట వేయగలిగాయని వారు అన్నారు. ఫారెక్స్ మార్కెట్లో డాలర్-రూపీ ఎక్స్ఛేంజ్ రేటు ట్రేడింగ్ గురువారం 83.15 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 83.12-83.22 శ్రేణిలో కదలాడింది. గత ముగింపు సెషన్‌తో పోలిస్తే, చివరికి 9 పైసల నష్టంతో 83.22 వద్ద క్లోజైంది. బుధవారం కూడా మారకం విలువ 9 పైసల నష్టం తో 83.13 వద్ద ముగిసింది. ఈ వారంలో ఇప్పటివరకు రూపాయి మారకం విలువ 61 పైసల మేర క్షీణించింది. మున్ముందూ రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఆరు నెలలుగా బలపడుతోంది
అంతర్జాతీయంగా అమెరికన్ కరెన్సీ విలువ ఆరు నెలల గరిష్ఠ స్థాయికి బలపడటంతోపాటు ముడిచమురు ధరలు మరింత ఎగబాకడంతో రూపాయి విలువకు గండి పడిందని ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ట్రేడింగ్‌లో 83.08 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్స్ఛేంజ్ రేటు.. ఇంట్రాడేలో 83.02 నుంచి 83.18 శ్రేణిలో కదలాడింది. చివరికి, 9 పైసల నష్టంతో 83.13 వద్ద ముగిసింది. గత ఏడాది ఆగస్టు 21న కూడా ఎక్స్ఛేంజ్ రేటు ఈ రికార్డు కనిష్ఠ స్థాయి 83.13ని తాకింది. కాగా, మొన్నటి మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి ఏకంగా 33 పైసలు క్షీణించడంతో ఎక్స్ఛేంజ్ రేటు మళ్లీ 83 స్థాయిని దాటింది. మన మార్కెట్ నుంచి వెనక్కి పోతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడులు, ఎగబాకుతున్న ముడిచమురు ధరలు రూపాయిపై మున్ముందు మరింత ఒత్తిడిని పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, రూపాయికి మద్దతుగా ఆర్‌బీఐ రంగ ప్రవేశం చేసి, మార్కెట్లోకి డాలర్లను విడుదల చేయడంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు రూపాయికి కనిష్ఠ స్థాయిల్లో మద్దతునిచ్చే అవకాశాలున్నాయి.