Hamas: పీల్చేగాలి, తాగే నీరు, తినే తిండి, ఉండే ఆవాసం, కట్టుకునే దుస్తులు, మొక్కే దేవుడు, ఆచరించే మతం.. ఇవన్నీ ఒక మనిషికి సంబంధించిన కనీస ఇష్టాలు. వీటిని ఇతరులు ప్రభావితం చేయడానికి హక్కు లేదు. ప్రజాస్వామ్యం కాదు నియంతృత్వం వర్ధిల్లుతున్న దేశాలలో కూడా ఈ కనీస హక్కులను దూరం చేసే అధికారం ఇంకెవరికీ లేదు. కానీ మత చాందసవాదాన్ని అణువణువూ ఒంట పట్టించుకున్న కొందరి తీరు వల్ల ప్రపంచమే ప్రమాదపు టంచున నిలిచింది. వారి ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతుండటం, వారికి కొంతమంది ఆర్థిక సహకారాలు అందిస్తుండడం వల్ల ప్రపంచంలో దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. కనీ విని ఎరుగని ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఆ దుర్మార్గుల బారిన పడి నరకం చూస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే ప్రపంచంలో చీడపురుగుల సంఘం అని పెడితే మొదటి పది స్థానాల్లో వారే ఉంటారు. వారిని కనుక సమూలంగా నిర్మూలించకపోతే ప్రపంచ వినాశనం తప్పదు.
పాలస్తీనాలో పురుడు పోసుకున్న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ దేశంలో కనీ విని ఎరుగని స్థాయిలో కల్లోలం సృష్టించారు. చిన్నపిల్లలను సైతం ఆ దుర్మార్గులు వదలలేదు. పైగా వారిని హింసిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. వీరి అంతిమ లక్ష్యం వారి మతం వారు మాత్రమే ఉండటం. బలవంతంగా వారి మతాన్ని మార్పించడం.. వారి రాజ్యం మాత్రమే విలసిల్లే విధంగా చేయడం.. వీరు మాత్రమే కాదు నైజీరియాలో బోకో హరామ్, లెబనాన్ లో హిజుబుల్లా, ఇరాక్, సిరియా దేశాల్లో ఐసీస్, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు, పాకిస్తాన్ లో లష్కరే_ ఈ_ తోయిబా, జైషే మహమ్మద్.. ఈ ఉగ్ర మూకలు చేస్తున్న అకృత్యాలు అన్ని ఇన్ని కాదు. బలవంతంగా వారి మతంలోకి ఇతరులను మార్పించడం, చాందసవాద ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, మహిళలకు కనీస హక్కులు లేకుండా చేయడం, హింసను వ్యాపింప చేయడం వీరి ప్రధాన లక్ష్యాలు. పోనీ వీరు వారి దేశంలో ఏమైనా సక్కగా ఉన్నారా అంటే.. లేదు. వాళ్లలో వాళ్లే కొట్టుకు చస్తుంటారు. ప్రస్తుతం పాకిస్థాన్లో లష్కరే తర్వాత సంస్థకు చెందిన సభ్యులు వాళ్ళకు వాళ్ళే కాల్చుకొని చేస్తున్నారు. నైజీరియాలో బోకో హరామ్ లో కూడా అదే పరిస్థితి. హమాస్ తీవ్రవాదులు కూడా వారిలో వారికి పడక ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఐసీస్ లో కూడా ఇదే పరిస్థితి. సాధారణంగా ఒక లక్ష్యానికి సంబంధించి అడుగులు వేస్తున్నప్పుడు.. దానికి అనుగుణంగా చర్యలు ఉండాలి. కానీ ఈ ఉగ్రవాదులు కేవలం హింసను మాత్రమే అమలు చేస్తున్నారు. తమ మతం తప్ప ఇతర మతం ఉండకూడదనే ఉద్దేశంతో సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నారు.
ఈ ఉగ్రవాద సంస్థలు దేశాల్లో అనేక రకాలుగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నాయి. అమెరికా నుంచి మొదలు పెడితే ఇజ్రాయిల్ వరకు బాధిత దేశాలే. ఈ ఉగ్రవాద సంస్థలను ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు ఆర్థికంగా చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. కేటాయింపులు మొత్తం రక్షణరంగ సామగ్రి కొనుగోలుకే ఖర్చు చేస్తుండడం వల్ల అది అంతిమంగా అభివృద్ధి మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించి ఈ ఉగ్రవాద సంస్థలను అంతం చేస్తేనే ప్రపంచం బాగుపడుతుంది. లేకుంటే ఎక్కడో ఒకచోట ఈ ఉగ్రవాద సంస్థలు విధ్వంసకర చర్యలకు పాల్పడుతుండడం వల్ల అది అంతిమంగా ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపిస్తోంది.