Telangana Elections 2023: ఏపీలో వైసిపి భయపడుతోందా? తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో బెంగ వెంటాడుతోందా? అక్కడ ఎదురుగాలివీయడంతో.. ఇక్కడ కూడా తప్పదని భావిస్తున్నారా? వైసీపీ సీనియర్లు అంతర్మధనం చెందుతున్నారా?అక్కడ ఫలితాలు బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి నుంచి వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
నాగార్జునసాగర్ పై దండయాత్ర జగన్ కు భారీగా డ్యామేజ్ చేసింది. సరిగ్గా తెలంగాణ పోలింగ్ ముంగిట పోలీసులు సాగర్ వద్ద మోహరించడం.. ఉద్రిక్తత కోసమేనని.. తద్వారా సెంటిమెంట్ రగిలించి కెసిఆర్ కు లబ్ధి చేకూర్చడానికేనని ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. పోనీ ఎంత చేసిన కేసీఆర్ గెలవగలరా? అన్నది అనుమానమే. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే మాత్రం జగన్ ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. గత నాలుగు సంవత్సరాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా పోలింగ్ ముంగిట జగన్ సర్కార్ చేసిన ఈ పనితో… కెసిఆర్ తో మంచి సంబంధాలే ఉన్నాయి కానీ.. అవి రాష్ట్ర ప్రయోజనాలకు కావని తేటతెల్లం అయ్యింది.
వాస్తవానికి కెసిఆర్ అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇచ్చారు. కోటి ఎకరాలకు పైగా సాగునీరానించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. అయితే ఆయన ఒంటెత్తు పోకడలు, అధిక ధరలు, నిరుద్యోగ సమస్య, సగటు గ్రామీణ ప్రజల ఆదాయం పడిపోవడం, భూ సమస్యలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి దోహద పడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు గుంప గుత్తిగా కాంగ్రెస్ కు పడినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి. ఇది ఏపీలో వైసీపీ నేతలకు గుగులు పుట్టిస్తున్నాయి.
గత నాలుగు సంవత్సరాల నుంచి వైసిపి ప్రభుత్వం సంక్షేమంపైనే దృష్టి పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదు. నవరత్నాలతో పేదల జీవన ప్రమాణాలు పెరగలేదు. నిత్యావసర ధరలు, చార్జీలు, పన్నులు గణనీయంగా పెరిగాయి. అందుకే అక్కడ కాంగ్రెస్ కు ప్రజలు మొగ్గు చూపినట్లు.. ఇక్కడ తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రజలు జై కొడతారన్న ఆందోళన వైసీపీ శ్రేణులు కనిపిస్తోంది. రేపు తుది ఫలితాలు వెల్లడైన తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.