
కేంద్ర ఆయూష్ మంత్రి కిరణ్ రిజుజుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా లేఖ రాశారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన ఆనందయ్య కరోనా నివారణ మందుపై దృష్టి సారించాలని ఆయన విన్నవించారు. కృష్ణపట్నం గ్రామంలో ఊరంతా ఒక్క కోవిడ్ కేసు కొన్ని నెలలుగా నమోదు కాలేదని.. ఆనందయ్య ఇచ్చిన ఆయుర్వేద కరోనా మందు బాగా పనిచేస్తోందని కేంద్రమంత్రి దృష్టికి సోము వీర్రాజు తీసుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా రోగులు ఈ మందును తీసుకొని రికవరీ అవుతున్నారని.. దీనిపై పరిశోధన జరిపి అందరికీ ఆయూష్ శాఖ తరుఫున పంచేలా చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు లేఖలో విన్నవించారు. ఇప్పటిదాకా కృష్ణపట్నంలో జీరో కేసులు నమోదయ్యాయంటే ఈ మందు ప్రభావాన్ని అర్థం చేసుకోవాలన్నారు.
ఆయుర్వేదంలో ఆరితేరిన నిపుణుడు ఆనందయ్య తయారు చేస్తున్న ఈ కరోనా మందు పదార్థాలు, ఔషధ గుణాలను పరిశీలించి దాన్ని అందరికీ పంచేలా చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు లేఖలో విన్నవించారు. ఆనందయ్య మందును తీసుకొని పెద్ద ఎత్తున ప్రజలు రికవరీ అవుతున్నారని.. పత్రికలు, టీవీ చానెల్స్ లోనూ వారు బాగుపడినట్లు వార్తలు వస్తున్నాయని విన్నవించారు.
కృష్ణపట్నం చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి ఈ మందును తీసుకొని కరోనానుంచి కోలుకున్నారని సోము వీర్రాజు లేఖలో తెలిపారు. అందుకే ఏపీ వ్యాప్తంగా.. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ సంప్రదాయ మెడిసన్ కోసం తండోపతండాలుగా వస్తున్నారని తెలిపారు.
మన ప్రాచీన సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదాన్ని గుర్తించాలని.. 5000 ఏళ్లుగా భారత్ లో ఈ ఆయుర్వేద మందులు వాడుతున్నారని సోము వీర్రాజు తెలిపారు. శాస్త్రీయతతో కూడిన ఈ మందుతో కరోనా తగ్గుతోందని.. ఐసీఎంఆర్ సైతం దీనిపై పరిశోధన చేస్తోందని తెలిపారు. ఆయుర్వేద మందు కరోనాపై పనిచేస్తుందని తేలితే దీన్ని కేంద్రప్రభుత్వం గుర్తించి వెంటనే అందరికీ పంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. కరోనాకు మందు లేదని.. ఈ ఆయుర్వేదంతో తగ్గించవచ్చని.. దీన్ని గుర్తించాలని సూచించారు.
ఈ ఆనందయ్య కరోనా మందుపై ఒక కమిటీని వేసి త్వరగా పరిశోధించి మన సంప్రదాయ ఆయుర్వేద వైద్యం గొప్పతనాన్ని చాటి చెప్పాలని సోము వీర్రాజు లేఖలో కోరారు. ఈ సంప్రదాయ వైద్యంతో భారత్ లోని ఆయుర్వేద వైద్యం గొప్పతనం ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. గ్రామాల్లోని ఎంతో మంది రోగులకు , పట్టణ ప్రజలకు పంచి వారి ప్రాణాలను భారత ప్రభుత్వం ఈ మందుతో కాపాడవచ్చని సూచించారు.
ఆయుర్వేదంతో భారతీయుల ఆరోగ్యం కాపాడగలమని.. ఈ విపత్తు నుంచి ఆయర్వేద మందులే భారత్ ను రక్షించగలవని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు. ఈ విలువైన మందును వెంటనే గుర్తించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.