
కొన్నిసార్లు ఒకరికి దక్కాల్సిన విజయాలు మరొకరి పేరిట లిఖించబడతాయి. దీన్ని అదృష్టం అని కొట్టిపారేయలేం, ఆ విజయాన్ని అందుకునే అర్హత ఉంటేనే అదృష్టం కూడా పని చేస్తోంది. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమా గురించి కొత్తగా ఏమి చెప్పాలి, భారతీయ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన సినిమా ఇది. సినిమానా ఇది ? కాదు, ఇదొక ఎమోషనల్ మిషన్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి కేరాఫ్ అడ్రెస్.
అది 1995వ సంవత్సరం.. కరెక్ట్ గా అక్టోబర్ 20న.. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైంది ఈ సినిమా. ఆ తరువాత ఎన్నో రికార్డులు అవార్డులు. కట్ చేస్తే పాతికేళ్ల తరువాత కూడా, ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఐతే, ఆ గొప్పతనం అంతా నటీనటులదే, వారి అద్భుతమైన నటనదే. షారుక్ ఖాన్, కాజోల్ జంట తమ కళ్ళల్లోని ప్రేమ మైకంతో ప్రేక్షకులను మరో లోకానికి తీసుకువెళ్లారు. సహజంగా ఒక సినిమాలో ఇద్దరు సమాన హీరోలు ఉంటే.. వారిద్దరి మధ్య నటనలో పోటీ ఉంటుంది. కానీ హీరోహీరోయిన్లు అయిన ‘షారుఖ్ – కాజోల్’ ఈ సినిమాలో పోటీ పడి నటించారు.
ఈ సినిమా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా సినీ చరిత్రలో నిలిచిపోయింది అంటే.. దానికి కారణం షారుఖ్ – కాజోల్. ముఖ్యంగా ఈ సినిమాకి ముందు షారుఖ్ ఖాన్ సాధారణ హీరో. కానీ, ఈ సినిమా తరువాత షారుఖ్ స్టార్ హీరో. ఒక్క రాత్రిలోనే షారుఖ్ సినీ జీవితాన్నే మార్చేసిన సినిమా ఇది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఈ సినిమాకి మొదట షారుఖ్ ఖాన్ ను హీరోగా అనుకోలేదట.
ఆదిత్య చోప్రాకి ఎప్పటినుండో ఇండో-అమెరికన్ సినిమా ఒకటి చేయాలని కల కనేవాడట. అందుకే ఈ సినిమాలో హీరోగా మొదట హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ను అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ టామ్ క్రూజ్ కి దకాల్సిన విజయం షారుఖ్ పాదాల దగ్గరకి వచ్చి పడిందని అంటారు కానీ, ఈ సినిమా కథ షారుఖ్ కోసమే పుట్టిందా అన్నట్లుగా షారుఖ్ తన పాత్రలో జీవించాడు.
ఇప్పటికీ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆదరణ తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో ఒక థియేటర్ లో ఈ సిసిమా 1009 రోజులు ఆడిందంటేనే ఈ సినిమా గొప్పతనం గురించి అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమా భారతీయ సినిమాకు ఒక సూపర్ స్టార్ ని ఇచ్చింది.