
Hyderabad Mayer : మహిళలకు సాధారణంగానే ఓర్పు, సహనం, స్పందించే హృదయం, చలించిపోయే మనస్తత్వం, బాధ ఎక్కువగా ఉంటాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మేయర్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమించడంతో నగర ప్రజలు సంతోషపడ్డారు. మహిళగా సమస్యలపై ఆమె వేగంగా స్పందిస్తారు, పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు తీరుతాయని అంతా అనుకున్నారు. కానీ ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సమస్యలను పట్టించుకున్న సందర్భం అయితే ఏదీ లేదు. వరదలు వచ్చినా, రోడ్లపై గుంతలు పడినా, రోడ్లు అధ్వానంగా మారినా, కాలనీలు నీట మేనిగినా, డ్రెయినేజీలు పొంగి పొర్లుతున్నా, చివరకు వీధికుక్కలు మనుషులను పీక్కు తింటున్నా.. విజయలక్ష్మి మనసు కాసింతైనా చలిండం లేదు.
వరదలప్పుడు అలా..
గత జూలైలో హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లు మునిగిపోయాయి. చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు నిరాశ్రయులయ్యారు. తిండి లేక తల్లడిల్లారు. అప్పుడు మేయర్‌గా వదర బాధితులను ఆదుకోవాల్సిన విజయలక్ష్మి కనీసం గడప దాటలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ముంపు కాలనీల్లో పర్యటిస్తున్నా మేయర్ మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. మీడియా ఈ విషయమై అడిగితే ‘ఇంకో ఐదేళ్లు వర్షాలు కురవొద్దని దేవుడిని ప్రార్థిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు వానలు లేకపోతే పరిస్థితి ఏమౌతుంది అన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మేయర్ మాట్లాడడం సంచలనంగా మారింది.
వీధి కుక్కలు కరిస్తే.. ఇలా..
ఇప్పుడు విశ్వనగరంలో వీధి కుక్కలు హల్‌చల్ చేస్తున్నాయి. ముసారంబాగ్‌లో ఇటీవల ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేసి చంపేశాయి. అయినా ఈ ఘటనపై మేయర్ ఓ తల్లిగా స్పందించాల్సింది పోయి వెకిలిగా నవ్వుతూ మాట్లాడారు. కుక్కలకు ఆకలి వేయడంతో మనుషులపై దాడిచేస్తున్నాయని పేర్కొన్నారు. మాంసం దుకాణాలు, భోజనం పెట్టేవారు లేకపోతే ఇలా ఆకలితో మనుషులపై దాడిచేస్తున్నాయని తెలిపారు. మేయర్‌స్థానంలో ఉండి ఆమె చేసిన వ్యాఖ్యలో మరోమారు వివాదాస్పదమయ్యాయి.
సోషల్ మీడియలో ట్రోల్..
మేయర్ విజయలక్ష్మి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ వుతున్నాయి. నగర ప్రథమ మహిళ అయి ఉండి కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్న తీరును నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తుంటే ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.