హైదరాబాద్ లో పోలీసింగ్ అద్భుతం అంటూ ఓ వైపు సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులు చెబుతుంటారు. ఇక తెలంగాణ పోలీసులే దేశంలో టాప్ కాప్స్ లు అంటారు. కానీ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వచ్చి ఇక్కడ ఉగ్రవాదులను కనిపెట్టదాకా మన పోలీసులు పసిగట్టలేదంటే వారి వైఫల్యాన్ని తెలుస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటీవల బీహార్ లోని దర్బంగా రైల్వేస్టేషన్ లో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న ఆధారాలు లభించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉగ్రకోణం మూలాలను మరింతగా అన్వేషించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పేలుడు ఘటన నేపథ్యంలో ఇప్పటివరకు హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో భారీ ఎత్తున సోదాలు , దర్యాప్తు నిర్వహించింది ఎన్ఐఏ. ఇక పై హైదరాబాద్ కేంద్రంగా లోతుగా పరిశోధన కొనసాగించనున్నట్లు సమాచారం.
ఉగ్రమూలాలు హైదరాబాద్ లో బయటపడడంతో స్వయంగా పర్యవేక్షించేందుకు ఎన్ఐఏ ఉన్నతాధికారులు హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. ఇక్కడి నుంచి వారు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
బీహార్ రైల్వేస్టేషన్ లో పేలుడులో మల్లేపల్లిలో నివాసముంటున్న నసీర్ఖాన్, ఇమ్రాన్ మాలిక్ లు కీలక పాత్ర పోషించారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. మల్లేపల్లిలో 20 ఏళ్ల నుంచి మాలిక్ సోదరులు నివాసం ఉంటున్నారని.. బట్టల దుకాణం నిర్వహిస్తున్నారని కనుగొన్నారు. వీరుపాస్ పోర్ట్ పై ఓసారి పాకిస్తాన్ కు వెళ్లొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు.
లష్కరే తోయిబా ఉగ్రసంస్థ సభ్యుడైన ఇక్బాల్ తో వీరు తరచూ సంప్రదింపులు జరుపుతూ ఇక్కడికి హవాలా రూపంలో డబ్బు తీసుకువచ్చేవాడని అధికారులు గుర్తించారు.
మాలిక్, ఇమ్రాన్ లను ఎన్ఐఏ బుదవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరికి పాకిస్తాన్ ఉగ్రవాదులు.. దేశంలో పట్టుబడిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ గుర్తించింది. మరిన్ని వివరాల దిశగా పరిశోధన జరుపుతోంది. వీరు హైదరాబాద్ లో 20 ఏళ్లుగా బట్టల దుకాణం నడుపుతూ ఏమీ ఎరుగనట్టుగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడం స్థానికులు, పోలీసులు కూడా కనిపెట్టకుండా ఉండడం చూసి అంతా షాక్ అవుతున్నారు.