ఉత్తరప్రదేశ్ బీజేపీలో కొత్త జోష్ నింపే ఫలితాలు వచ్చాయి. 75 జిల్లా పంచాయతీ చైర్ పర్సన్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో 67 పంచాయతీ స్థానాల్లో కాషాయ జెండా ఎగిరింది. ప్రధాన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. దీంతో.. యూపీలోని ఆ పార్టీ కేడర్ లో ఆనందం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల ముందు ఇది గొప్ప విజయంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ ఎన్నికలకు ముందు యూపీలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. విపక్షాలు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సత్తా చాటాయి. మెజారిటీ స్థానాలను విపక్షాలే దక్కించుకున్నాయి. రామ మందిరం నిర్మిస్తున్న అయోధ్య, మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి వంటి చోట్ల కూడా బీజేపీ ఓటమిపాలైంది. దీంతో.. ఆ పార్టీ అగ్ర నేతల్లో అంతర్మథనం మొదలైంది.
ఈ పరిస్థితుల్లో చైర్ పర్సన్ల ఎన్నికలో బీజేపీ గెలుపు వారిలో హుషారు తెచ్చింది. మొత్తం 3 వేల మంది జిల్లా పంచాయతీ సభ్యులు 75 మంది చైర్ పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే.. పోలింగ్ కు ముందే 21 చోట్ల బీజేపీ మద్దతుదారులు, ఎస్పీకి చెందిన క్యాండిడేట్ ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలకు శనివారం ఓటింగ్ నిర్వహించారు.
పార్టీ గుర్తులు లేకుండా సాగిన ఈ ఎ న్నికల్లో బీజేపీ తరపు వారు మొత్తం 67 చోట్ల గెలిచారు. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన యూపీ బీజేపీ నేతలు.. ఇదే జోష్ 2022 అసెంబ్లీ ఎ న్నికల్లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ పోటీ చేయలేదు. అయితే.. సమాజ్ వాదీ పార్టీ మాత్రం ఈ ఎన్నికలపై అభ్యంతరం తెలిపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపించింది. ఎస్పీ అధినేత అఖిలేష్ మాట్లాడుతూ… వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తీరుగా పోలింగ్ సాగితే.. బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని ఘాటు విమర్శలు చేశారు.