
ఒక వ్యక్తితో జీవితం పంచుకున్న తర్వాత.. మరొకరితో రిలేషన్ పెట్టుకోవడం తప్పు. ఇది పెళ్లినాడు ఇచ్చిన మాటను తప్పడమే. ఒకవేళ.. భాగస్వామితో జీవితం కొనసాగించలేని పరిస్థితి ఉంటే.. చట్టబద్ధంగా విడిపోవచ్చు. రాజ్యాంగం కూడా ఆ హక్కును కల్పించింది. అలా.. ఎవరి దారి వారు చూసుకోవచ్చు. ఎవరి బతుకు వాళ్లు బతకొచ్చు. కానీ.. ఇది చేయకుండా.. వివాహేతర సంబంధం కొనసాగిస్తుంటారు చాలా మంది. ఇది నైతికపరమైన తప్పేకాకుండా.. అత్యంత దారుణమైన ముగింపునకు దారితీస్తుంది. ఇది ఇప్పటి వరకు వేలాది మంది విషయంలో ప్రూవ్ అయ్యింది. అయినప్పటికీ.. కొందరు మళ్లీ మళ్లీ ఇదే తప్పు చేస్తున్నారు. తద్వారా.. జీవితాలను అర్ధంతరంగా ముగించడమో.. కటకటాల వెనుక మగ్గిపోవడమే చేస్తున్నారు.
ఇదే కేసు ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. చిట్టి రామవరం ప్రాంతంలో భార్యాభర్తలు నివసిస్తున్నారు. అయితే.. కొంత కాలంగా భార్య మరో యువకుడితో సంబంధం పెట్టుకుంది. అది కూడా.. మైనారిటీ తీరని బాలుడితో వ్యవహారం నడిపిస్తోంది. అతడి వయుసు కేవలం 16 సంవత్సరాలు. ఈ తంతు కొంత కాలంగా సాగుతోంది. ఈ క్రమంలోనే.. ఆ బాలుడితో బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.
దీనికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె అక్క కూడా వంతపాడడం గమనార్హం. బుద్ధిచెప్పాల్సిన ఆమె.. దీనికి జై కొట్టింది. దీంతో.. ఆ మహిళ, ఆమె అక్క, ప్రియుడు, అతని స్నేహితుడు మొత్తం నలుగురు కలిసి ఆమె భర్తను చంపేయడానికి ప్లాన్ వేశారు. పథకం ప్రకారం.. భర్తను ఓ పని చెప్పి బయటకు పంపింది భార్య. దీంతో.. ప్రియుడు, అతడి స్నేహితులు మధ్యలో మాటువేశారు. అతన్ని కలిసి, మద్యం తాగుదామంటూ తీసుకెళ్లారు. ప్రమాదాన్ని ఊహించలేకపోయిన అతగాడు.. వాళ్లతో వెళ్లాడు.
బీరు బాటిల్స్ తీసుకొని అడవిలోకి వెళ్లి ఫుల్లుగా తాగారు. అనంతరం అవే బాటిల్స్ పగులగొట్టి, వాటితోనే పొడిచి చంపారు. శవాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు. బయటి వ్యక్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా.. అతని భార్య నుంచి మొదలు పెట్టడంతో.. విషయం మొత్తం గడ్డా గడ్డా కారిపోయింది. తీసుకెళ్లి నిందితులందరినీ బొక్కలో తోశారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా.. తాము మాత్రం తప్పించుకుంటామనే భ్రమలో నేరాలు చేస్తూనే ఉన్నారు. దొరికిపోతూనే ఉన్నారు. జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.