1906వ సంవత్సరంలో ఒక రోజు.. కలకత్తాలో 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. దాదాబాయి నౌరోజీ సభకు అధ్యక్షత వహించారు. సమావేశం ఆరంభానికి ముందు పతాకానికి వందన సమర్పణ చేయాలి. ఆ గౌరవ వందనం చేయాల్సింది బ్రిటీష్ పతాకానికి! అందరూ అలవాటుగా లేచి నిలబడ్డారు. సెల్యూట్ చేశారు కూడా. కానీ.. ఒక వ్యక్తికి చేయి మాత్రం సరిగా పైకి లేవడం లేదు. సెల్యూట్ చేయడానికి మనసు మాత్రం అంగీకరించట్లేదు.
గార్డ్ ఆఫ్ హానర్ ముగిసిన తర్వాత.. వెను వెంటనే నౌరోజీ ఓ మాటన్నారు. బ్రిటీష్ జెండాకు నమస్కరించడానికి.. నాకు మనస్కరించడం లేదు. మనకంటూ ఓ జెండా ఎందుకు ఉండకూడదు? అని ప్రశ్న లేవనెత్తారు. అందరూ ఆలోచనలో పడిపోయారు. ఆయనే.. భరతమాత తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. ఆయన జాతీయ పతాకాన్ని రూపొందించి నేటికి వందేళ్లు. ఈ సందర్భంగా ఆ చిరస్మరణీయ ఘట్టాలను ఓసారి తరచి చూద్దాం.
దాదాబాయి నౌరోజీతో జాతీయ పతాక ఆవశ్యకత వివరించిన తర్వాత తీవ్రంగా ఆలోచించిన భారత జాతీయ కాంగ్రెస్.. ఆ తర్వాత విషయ నిర్ణయ సమితి సభ్యునిగా వెంకయ్యను నియమించింది. ఆ వెంటనే జాతీయ పతాకం రూపొందించే పనిలో పడ్డారు వెంకయ్య. ఇందుకోసం దేశవ్యాప్తంగా పర్యటించారు. ఎందుకంటే.. తయారు చేయబోయేది జాతికి చిహ్నం. ఎలా ఉండాలి? ఏ అంశాలను ప్రతిబింబించాలి? అసలు జాతీయ పతాకం ద్వారా మనం ఏం చెప్పాలి? వంటి ఎన్నో ఆలోచనలు ఆయనలో మెదిలేవి.
ఈ క్రమంలోనే.. ఎన్నో ప్రాంతాలు తిరిగిన వెంకయ్య.. ఆ అనుభవాలతో ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకాన్ని కూడా రాశారంటే.. ఆయన అధ్యయనం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన అధ్యయనాన్ని భారతజాతీయ కాంగ్రెస్ ముందు ఉంచారు. ఈ క్రమంలోనే 1921 మార్చిలో విజయవాడలోని విక్టోరియా జూబిలీ హాల్ లో గాంధీజీ సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. కాగా.. అప్పటికే వెంకయ్య, గాంధీజీ జాతీయ పతాకంపై పలుమార్లు మాట్లాడుకున్నారు. దీంతో.. ఈ సమావేశంలోనే జాతీయ పతాకాన్ని రూపొందించే బాధ్యతను పూర్తిగా వెంకయ్యకు అప్పగించారు.
తన అనుభవాలతో ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిన వెంకయ్య.. కేవలం మూడు గంటలలోనే ఈ పతాకం నమూనాను సిద్ధం చేశారు. ఇందులో.. వెంకయ్య సహచరుడు ఈరంకి వెంకటశాస్త్రి కూడా సహకరించారు. పింగళి వెంకయ్య తయారు చేసిన పతాకంలో పైన ఎరుపు, ఆకుపచ్చ రంగులతోపాటు చరఖా చిహ్నం ఉంది. అయితే.. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ఎరుపు, ఆకుపచ్చతోపాటు తెలుపు రంగులను కూడా చేర్చారు.
అయితే.. 1931వ సంవత్సరంలో కరాచీలో జరిగిన మహాసభలో రంగుల గురించిన సమస్యను సిక్కులు లేవనెత్తారని చెబుతారు. ఈ క్రమంలో సమీక్షించిన కమిటీ.. ఎరుపు రంగు చోటులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను ఖరారుచేసింది. మధ్యలో చరకాను ఉంచింది. ఈ మార్పును జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. అయితే.. ఆ తర్వాత కాలంలో.. పార్టీ జెండాకు, జాతీయ పతాకానికి తేడా ఉండాలని నిర్ణయించారు. ఆ మేరకు 1947 జులై 22న నిర్ణయించిన తుది జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చరంగులతోపాటు మధ్యలో అశోకుని ధర్మ చక్రానికి స్థానం కల్పించారు.
ఆ విధంగా.. అంతిమ మార్పులకు లోనైన భారత జాతీయ పతాకం విశ్వ వినువీధుల్లో సగర్వంగా రెపరెపలాడుతోంది. యావత్ జాతి మొత్తం ఇది మా గుర్తింపు అంటూ గుండెలకు హత్తుకొంటోంది. స్వాతంత్ర సమరంలో జాతిని ఏకతాటిపైకి తెచ్చి స్వేచ్ఛావాయువలకు దారిచూపిన జెండా.. స్వాతంత్రానంతరం కూడా.. జాతీ ఐక్యతను ఇనుమడింప జేస్తూ ఆకాశంలో రెపరెపలాడుతూనే ఉంది. జాతి పతాక ఏర్పడిన వందేళ్ల సందర్భంగా.. అందరం నినదిద్దాం.. జై బోలో స్వతంత్ర భారత్ కీ.. జై.