Jagan: వైయస్ జగన్( Y S Jagan Mohan Reddy) గవర్నర్ దగ్గరకు వెళ్ళబోతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా పోటీ సంతకాల సేకరణ చేపట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దానిపై నివేదికతో పాటు వినతిపత్రం అందించేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు వెళ్లనుంది వైసిపి బృందం. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు భాగస్వామ్యంతో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ప్రైవేటు పరం చేయడమేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు భాగస్వామ్యంతో చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించింది. ఆ సంతకాలతోనే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నివేదించాలని నిర్ణయించింది.
* సంతకాలపై అనుమానం..
అయితే కోటి సంతకాల సేకరణ సవ్యంగా జరిగిందా? లేదా? అని పరిశీలిస్తే మాత్రం కచ్చితంగా లేదనే సమాధానం వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చవిచూసింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. పేరు మోసిన నేతలు సైతం ఓడిపోయారు. ఈ క్రమంలో చాలామంది పార్టీ నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారు. 18 నెలలు అవుతున్న నియోజకవర్గాలకు అందుబాటులోకి రావడం లేదు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన వారు హాజరు కావడం లేదు. కేవలం మీడియా మేనేజ్ తో నెట్టుకొస్తున్న వారు ఉన్నారు. తూతూ మంత్రంగా కార్యక్రమాలు జరిపిస్తున్న వారు ఉన్నారు. అటువంటప్పుడు కోటి సంతకాల సేకరణ అనేది ఎలా? అనేది ఒక అనుమానమే. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు సంతకం పెడితేనే కోటి సంతకాల సేకరణ పూర్తవుతుంది. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరు సంతకం పెట్టారు అనేది అబద్ధం.
* నిర్మాణం జరపకుండానే..
మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. ఇంకోవైపు తాజా మాజీ మంత్రులు చాలామంది ఇంకా అందుబాటులోకి రావడం లేదు. పేరుకే నియోజకవర్గ ఇన్చార్జిలు కానీ ఎక్కడా కార్యక్రమాల నిర్వహణ బాగాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కోటి సంతకాల సేకరణ అనేది జరిగి ఉంటుందా అన్నది అనుమానం. పైగా 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి తప్ప నిర్మాణాలు జరపలేదు. ఓ రెండు చోట్ల మాత్రం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా చోట్ల పునాదుల స్థాయిలోనే ఉండిపోయాయి. వాటిని పూర్తి చేసి ఉండి తర్వాత ప్రైవేటుకు అప్పగించి ఉంటే దానిని ప్రైవేటు పరం అంటారే తప్ప… అసలు నిర్మాణమే జరపకుండా… తాము మంజూరు చేసామని చెప్పుకోవడం ఏమిటంటే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికి అయితే కోటి సంతకాల సేకరణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు.