ఏపీలో జిల్లాల పునర్విభజనకు సిద్ధమయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకుతోడు 25 లేదా 26 ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది..? జిల్లాల పునర్విభజన, ఆఫీసుల ఏర్పాటు, ఆస్తుల పంపిణీ, ఇతర మౌలిక వనరుల కల్పనకు ఎంత వ్యయం కానుంది..? అన్న అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Also Read: సీఎం జగన్ కు మరో షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ
ఈ ఏడాది జనవరి నాటి అంచనాల ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటుకు రూ.1,300 కోట్ల ఖర్చవుతుందని ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు తెలిసింది. ఇంత ఖర్చంటే ఖజానాకు భారమని, మరింతగా తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఇతర ఉన్నతాధికారులతో మీట్ అయిన జగన్.. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనకు సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
జిల్లాల ఏర్పాటు అన్ని కోణాల్లో పూర్తిచేయడానికి కనీసం రూ.1,300 కోట్లు ఖర్చు కానుందని ఈ ఏడాది జనవరిలోనే సీఎంకు నివేదిక ఇచ్చారు. అయితే అప్పటికి ఇంకా జిల్లాల ఏర్పాటు ఎలా ఉండాలి..? వనరుల వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రూ.1,300 కోట్ల ఖర్చు భారమని తాజాగా భావిస్తున్నారు. ‘కొత్త జిల్లాల ఏర్పాటే పరిపాలనా సౌలభ్యం కోసం. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు. కాబట్టి మోయలేని ఆర్థిక భారాలు వద్దు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం రావాలి. ప్రస్తుతానికి కొత్త భవనాలు, మరొకటి ఇప్పుడే వద్దు. అందుబాటులో ఉన్న వన రులను ఉపయోగించుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే అద్దె భవనాలను ఎంపికచేయండి’ అని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Also Read: జనసేనలోకి మళ్లీ జేడీ.. పక్కా హామీ ఇస్తేనేనట..!
ఈ సమావేశంలో రాజకీయపరమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నారనే సమాచారం. కొద్దిరోజులుగా జిల్లాలపై నడుస్తున్న వివాదాల నేపథ్యంలో కొత్త సమస్యలు రాకుండానే పరిష్కారం చూపేలా ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ‘ప్రజల ఆభీష్టాలు, ఆ ప్రాంత ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు, ఇంకా అనేక సున్నితమైన అంశాలు పరిశీలన చేయాలి’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్