Kumaraswamy- KCR
Kumaraswamy- KCR: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. కానీ, భారత రాష్ట్ర సమితి అసలు పట్టించుకోవడం లేదు. బిఆర్ఎస్ ఏర్పాటు సమయంలో మొదటి టార్గెట్ కర్ణాటక ఎన్నికలు అని గొప్పగా ప్రకటించారు. కానీ, ప్రస్తుతం ఆ దిశగా ఆ పార్టీ నాయకులు అడుగులు వేయడం లేదు. మహారాష్ట్ర నుంచి ఎప్పుడో పాతికేళ్ల కిందట ఓ జిల్లాకు జడ్పీ చైర్మన్ గా చేశారని, ఆయన కంటే ప్రముఖ నేత ఎవరు ఉండరు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుని వారికి కండువాలు కప్పి మహారాష్ట్రలో బిఆర్ఎస్ హవా అని ఆస్థాన పత్రికలో రాసుకుంటున్నారు. కానీ తమ తొలి టార్గెట్ కర్ణాటక అని కేసిఆర్ స్వయంగా ప్రకటించిన రాష్ట్రంపై మాత్రం కనీసం దృష్టి సారించడం లేదు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ఊసే ఎత్తని పరిస్థితి బీఆర్ఎస్ నేతల్లో ఉండడం గమనార్హం.
కెసిఆర్ కు ఆత్మీయనేతలుగా జెడిఎస్ నాయకులు
టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చాలనుకున్న తర్వాత కెసిఆర్ కు అత్యంత ఆప్తునిగా మారిన జెడిఎస్ నేతలు. కుమారస్వామి, ఆయన కుమారుడు పిలిచిందే తడువుగా హైదరాబాదు వచ్చేవారు. కేటీఆర్ కుమారస్వామి కుమారునికి ఆప్యాయంగా టిఫిన్లు వడ్డించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. తాము కర్ణాటక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కూడా అప్పట్లో కెసిఆర్ ప్రకటించారు. అయితే ఇప్పుడు తండ్రి కొడుకులు బిఆర్ఎస్ గురించి ఆలోచించడం లేదు. బిఆర్ఎస్ మద్దతు గురించే ఆలోచించడం లేదు. కర్ణాటకలో జెడిఎస్ పార్టీకి ఎప్పటిలాగే పాతిక సీట్ల వరకు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్కు క్లియర్ మెజారిటీ వస్తుందని, కింగ్ మేకర్ అయ్యో ఛాన్స్ లేదని ఆ సర్వేలు సారాంశంగా చెబుతున్నాయి.
మరింత ఎక్కువగా కష్టపడుతున్న జెడిఎస్..
సర్వేలు చెబుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్న జెడిఎస్ నేతలు మరింత కష్టపడుతున్నారు. యాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మద్దతిస్తామని బిఆర్ఎస్ ఆసక్తి చూపినా.. కుమారస్వామి ఆసక్తిగా లేరని చెబుతున్నారు. కెసిఆర్ ను చూస్తే గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమ నేత మాత్రమేనని.. అలాంటి నేత తమ రాష్ట్రం కోసం పనిచేస్తారంటే కన్నడ ప్రజలు నమ్మరని.. అది తమ పార్టీకి మైనస్ అవుతుందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ఆర్థిక సాయం ప్రచారం ఉన్న.. కుమారస్వామి మాత్రం బిఆర్ఎస్ తో వీలైనంత దూరం మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు.
ఆ హడావిడి ఇప్పుడు ఏమైంది..
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత పెద్ద ఎత్తున కేసీఆర్ మాట్లాడారు. దేశ రాజకీయాల్లో బిఆర్ఎస్ బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని పేర్కొన్నారు. కలిసి వచ్చే పార్టీలతో ఆయా రాష్ట్రాల్లో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. అయితే టిఆర్ఎస్ గా మారిన తర్వాత వచ్చే మొదటి ఎన్నికలైన కర్ణాటకలో తమ సత్తాను చాటుతామని స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యి ఇప్పటికే ప్రధాన పక్షాలు జోరుగా ప్రచారాలను సాగిస్తున్న బిఆర్ఎస్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. దీనికి కారణాలపై స్పష్టత రాలేదు. ఒకపక్క కవిత వ్యవహారంలో బిఆర్ఎస్ నేతలు బిజీగా ఉండడం వల్లనే ఈ ఎన్నికలను పట్టించుకోలేదని ప్రచారం జరుగుతుంటే, కలిసి వెళ్దాం అని భావించిన జెడిఎస్ దగ్గరకు చేరనీయకపోవడంతో బిఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
Kumaraswamy- KCR
కర్ణాటక ఎన్నికలను వదిలేసినట్టేనా..
కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో జేడీఎస్ నేతలు కలిసి వచ్చే అవకాశం లేకపోవడంతో బిఆర్ఎస్ కు ఇక్కడ పొత్తు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరితో కలిసి వెళ్లాలో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. పక్కన ఉన్న కర్ణాటకలోనే, తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే జెడిఎస్ నేతలే పొత్తుకు సిద్ధంగా లేనప్పుడు.. మిగిలిన రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే పార్టీలు ఏముంటాయి, ఎవరు ముందుకు వస్తారని చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిని కెసిఆర్ ఆవేశపూరితంగా బిఆర్ఎస్ గా మార్చారే తప్ప.. అందులో ఎటువంటి ఆలోచన, రాజకీయపరమైన ఎత్తుగడలు లేవన్న విషయం కర్ణాటక ఎన్నికలతో స్పష్టం కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Web Title: How did kumaraswamy feud between kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com