Roja and Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి రోజా ఒకరు. జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయత ప్రదర్శించిన నేతల్లో కూడా ఆమె ముందుంటారు. అయితే ఇటీవల ఆమె పెద్దగా కనిపించడం లేదు. సహజంగానే సినీ పరిశ్రమకు చెందిన ఆమె బిజీగా ఉంటారు. అందుకే కనిపించడం లేదని అంత భావించారు. అయితే ఆమె హై కమాండ్ పై మనస్థాపంతోనే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అయితే రోజాపై ఇటువంటి ప్రచారం కొత్త కాదు. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే తరహా ప్రచారం నడిచింది. ఆమె తమిళ చిత్ర పరిశ్రమ వైపు మళ్లీ వెళ్ళినట్లు.. అక్కడే స్థిరపడతారని టాక్ నడిచింది. రాజకీయాలు విడిచి పెడతారని కూడా విశ్లేషణలు వచ్చాయి. కానీ ఆమె తిరిగి తాడేపల్లి ప్యాలెస్ లో హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఉన్నఫలంగా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఆమె కనిపించడం లేదని తెలుస్తోంది.
వరుసగా రెండుసార్లు..
చిత్తూరు జిల్లా ( Chittoor district)నగిరి నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు రోజా. రెండుసార్లు కూడా అతి కష్టం మీద గెలిచారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం ఇచ్చింది. ఆ సమయంలో సైతం నగిరి నుంచి తక్కువ మెజారిటీతో గెలిచారు రోజా. అయితే ఇందుకు సొంత పార్టీ నేతల వెన్నుపోటు కారణమని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేయకముందే దీనిపైనే రోజా ఫిర్యాదు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన కొత్త కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పట్టించుకోలేదు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదు. అందుకు సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. విస్తరణలో మంత్రి పదవి వచ్చాక అందరి లెక్క తేల్చుతానని హెచ్చరించారు. అయితే ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా వ్యవహరించిన రోజా సొంత పార్టీ వారిని లెక్క చేయలేదన్న విమర్శ ఉంది.
ఆ మనస్థాపం తో
మొన్నటి ఎన్నికల్లో రోజాకు( RK Roja) టిక్కెట్టు ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలే కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెపై ఎంతో నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చారు. అయితే ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల పోలింగ్ జరిగిన నాడే సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. తమ పార్టీ నేతలే ప్రత్యర్థి తో చేతులు కలిపారని ఆరోపించారు. అయినా సరే తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కానీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పుడు కూడా అధినేత జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోలేదు. అయితే ఇటీవల నగిరి నియోజకవర్గంలో రెండు మండలాలు టిడిపి ఖాతాలో పడ్డాయి. వైసీపీ ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టి టీడీపీ కైవసం చేసుకుంది. దీనిపై కూడా హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు రోజా. సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ జగన్ పట్టించుకోకపోయేసరికి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇక రాజకీయాలు చేయడం వేస్ట్ అని.. వైసీపీలో కొనసాగడం కష్టమేనని తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరి రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.