
Minister Appalaraju: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అప్పలరాజుకు కేబినెట్ నుంచి తొలగింపు తప్పదా? సీఎంవో నుంచి పిలుపు అందుకేనా? పలాస నుంచి మంత్రిగా బయలుదేరిన ఆయన.. మాజీగా తిరిగొస్తారా? తాను మాజీని అవుతానని అప్పలరాజుకు ముందే తెలుసా? అందుకే వైరాగ్యం మాటలకు దిగారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు దక్కించుకున్న ఆయన పవర్ ను భలేగా ఎంజాయ్ చేశారు. కానీ నియోజకవర్గంలో పరిస్థితులు, దూకుడు స్వభావం, అనుచరుల అవినీతి ఆయనకు ప్రతిబంధకంగా మారాయి. తొలుత మంత్రి పదవి.. తరువాత ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో మొండిచేయి చూపుతారన్న టాక్ ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన అభిమానుల్లో కలవరానికి ఇదే కారణమవుతోంది. అర్జెంట్ గా సీఎం జగన్ ను కలడంపై శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
అనూహ్యంగా రాజకీయాల్లోకి..
2017లో అప్పలరాజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2018లో జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో చేరారు. అక్కడకు కొద్దిరోజులకే నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. 2109 ఎన్నికల్లో పలాస నియోజకవర్గ టిక్కెట్ పొందారు. ఎన్నికల్లో విజయం సాధించారు. 2020లో మంత్రి పదవి సొంతం చేసుకున్నారు. విస్తరణలో సైతం మంత్రి పదవి పోకుండా కాపాడుకున్నారు. ఇప్పుడు తాజా విస్తరణలో అప్పలరాజుకు ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో పాటు ఆశావహులుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది. దీంతో ఉన్న మంత్రుల్లో నలుగురైదుగురికి ఉద్వాసన తప్పేలా లేదు. ఆ జాబితాలో అప్పలరాజు ముందున్నట్టు తెలుస్తుండడంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
ఆ కారణాలతోనే తొలగింపు?
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. మొన్నటి పునర్వ్యవస్థీకరణ సమయంలో ధర్మాన ప్రసాదరావుకు పదవి దక్కింది. అయితే అప్పలరాజు శాఖపరంగా ఆశించిన పురోగతి సాధించలేకపోయారన్న టాక్ ఉంది. అటు పలాసలో సైతం వచ్చే ఎన్నికల్లో గెలుపు డౌటేనని హైకమాండ్ కు నివేదికలు అందాయి. దీంతో ఆయనకు మంత్రి వర్గం నుంచి తప్పించి నియోజకవర్గానికే పరిమితం చేస్తారని తెలుస్తోంది. ఎన్నికల నాటికి పరిస్థితి మారకుంటే టిక్కెట్ విషయంలో సైతం మొండిచేయి చూపుతారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే హైకమాండ్ ప్రత్యామ్నాయ నాయకత్వం వేటలో పడిందని కూడా తెలుస్తోంది. ఈసారి పలాస టికెట్ కూడా దక్కకపోవచ్చునని సర్వేల ఆధారంగా కొత్త అభ్యర్ధిని బరిలోకి దించుతారని అంటున్నారు. ముందుగా మంత్రి పదవిని తీసుకుంటారని ఎన్నికల వేళ టికెట్ దక్కే చాన్స్ ఉండకపోవచ్చు అని ప్రచారం సాగుతోంది.

అసమ్మతిని చల్లార్చడంలో ఫెయిల్..
పలాస నియోజకవర్గంలో మంత్రికి వ్యతిరేకంగా వైసీపీలో ఓ వర్గం బలంగా ఉంది. వారిని నిలువరించే ప్రయత్నంలో అప్పలరాజు విఫలమయ్యారు. మంత్రి అనుచరుల ఆగడాలు, భూ దందాలపై అసమ్మతి నాయకులు ఆధారాలతో హైకమాండ్ కు ఫిర్యాదుచేశారు. దీంతో అప్పలరాజుకు హైకమాండ్ గట్టి సంకేతాలే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల దిద్దుబాటు చర్యలు చేపట్టినా.. ఇంతలో మంత్రివర్గ విస్తరణ ఆయన పాలిట శాపంగా మారింది. అయితే తన పదవి మార్పుపై అప్పలరాజుకు ముందే తెలుసు. అందుకే తనకు మంత్రి పదవిపై అంత ఆశ లేదని చెప్పుకొచ్చారు. పశుసంవర్థక శాఖ పరంగా జగన్ పిలిచారని.. మంత్రివర్గం నుంచి తొలగింపుపై చర్చించలేదని తాజాగా వెల్లడించారు. మొత్తానికైతే లక్ తో మంత్రి అయిన అప్పలరాజు.. అనూహ్య రీతిలో అమాత్య పదవిని వదులుకోవాల్సి వస్తోంది. అటు ఎమ్మెల్యే టిక్కెట్ పైనా బెంగ వెంటాడుతోంది.