Janasena: వైసీపీ సర్కార్ జనసేన ఫోకస్ పెట్టింది. ఒక్కో రంగంలో అవినీతిని బయటపెడుతోంది. ఆధారాలు, గణాంకాలతో సహా వెల్లడిస్తోంది. తొలుత పాలవెల్లువ పథకంలో జరిగిన అవినీతిని బయటపెట్టింది. అనంతరం విద్యాశాఖలో సంక్షేమ పథకాల మాటున జరిగిన దోపిడీని వెల్లడించింది. తాజాగా గృహ నిర్మాణం విషయంలో జరిగిన భారీ కుంభకోణాన్ని బయటకు తీసింది. గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ నుంచి మంత్రుల వరకు చేసిన ప్రకటనలతో పాటు నీతి ఆయోగ్ నివేదికలను సరిపోల్చుకొని అవినీతి అంశాన్ని ప్రకటించింది. ఇది ప్రజల్లోకి బలంగా వెళుతుంది.
రాష్ట్రంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం కోసం 28,554 ఎకరాల ప్రభుత్వ భూమిని, 25374 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇది కాక ల్యాండ్ ఫూలింగ్ ద్వారా మరో 4,455 ఎకరాలు భూమిని సేకరించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకుగాను రూ. 56,102 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.అయితే శాసనసభలో చెప్పిన లెక్కలకు, మంత్రులు చెప్పిన లెక్కలకు తేడా కనిపిస్తోంది. అటు సీఎం జగన్ గృహ నిర్మాణం విషయంలో చేసిన ప్రకటనలు సైతం విరుద్ధంగా ఉన్నాయి. అటు నీతి ఆయోగ్ కు పంపిన లెక్కల్లో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
గత 17 నెలలుగా గృహ నిర్మాణం విషయంలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చేసిన ప్రకటనల్లో దాదాపు రూ.35,141 కోట్ల తేడా కనిపిస్తుండడం వెనుక చాలా రకాల అనుమానాలు రేగుతున్నాయి. 2021 జూన్ లో నీతి ఆయోగ్ కి ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో మూడు లక్షల 76 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. ఇందుకోసం 68,381 ఎకరాలు సేకరించినట్లు పొందుపరిచారు. 2022 మార్చిలో శాసనసభలో సీఎం జగన్ గృహ నిర్మాణం పై ఒక ప్రకటన చేశారు. మూడు లక్షల డబ్బై ఆరు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇందుకుగాను 71, 811 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో నీతి అయోగ్కు, సీఎం జగన్ ప్రకటనకు మధ్య 3 ఎకరాల భూ సేకరణ వ్యత్యాసం కనిపిస్తుంది. 2022 డిసెంబర్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి మరో లెక్క బయటపెట్టారు. జగనన్న కాలనీల కోసం 75670 ఎకరాల భూమిని సేకరించామని.. 20,961 కోట్లను ఖర్చు చేసినట్లు వివరించారు. భూమి సేకరణకు కేవలం రూ. 9517 కోట్లు ఖర్చు పెట్టినట్లు మంత్రి ప్రకటించారు.
ఇప్పుడు ఇదే విషయంపై జనసేన ఫోకస్ పెట్టింది. ఇటీవల జగన్ ఐదు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయనున్నట్లు ప్రకటించారు. మూడు లక్షల 76 వేల పట్టాలు అందిస్తే.. ఐదు లక్షల ఇల్లు ఎలా సాధ్యమని జనసేన ప్రశ్నిస్తోంది. దీనిని అవినీతి, దోపిడి అనరా అని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఒక్క గృహ నిర్మాణంలోనే వైసీపీ సర్కార్ 3000 కోట్లు దోపిడీ చేసిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మిగతా శాఖలకు సంబంధించి అవినీతిని కూడా బయట పెడతామని స్పష్టం చేశారు. ఒక్కో శాఖ అవినీతి వెలుగులోకి వస్తుండడంతో సంబంధిత మంత్రితో పాటు వైసిపి నేతలు కలవరపాటుకు గురవుతున్నారు.