Rahul Gandhi Bharat Jodo Yatra: సుప్త చేతనావస్తలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తేవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజులుగా యాత్ర సాగుతోంది. తమిళనాడులో ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోకి చేరుకుంది. రాహుల్ గాంధీ పర్యటన తమిళనాడు కాంగ్రెస్‌లో జోష్ నింపింది. రాహుల్ వెంట పెద్దఎత్తున కార్యకర్తలు నడిచారు. కేరళలోనూ అదే జోష్ కనిపిస్తోంది. అదే ఊపును తెలుగు రాష్ట్రాల్లోనూ వస్తుందని ఆ పార్టీ నాయకులు నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలోనూ భారత్ జోడో యాత్ర సాగనుంది. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్‌మ్యాప్ దాదాపు ఖరారైంది. అక్టోబర్ 24న రాహుల్ కర్ణా టకలోని రాయచూర్ నియోజకవర్గం నుంచి తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. హైదరాబాద్ శివారును టచ్ చేస్తూ మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశిస్తుంది. తెలంగాణలో 15 రోజులు 350 కిలోమీటర్ల మేర రాహుల్ తెలంగాణలో పాదయాత్ర చేస్తారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పోల్చితే యాత్ర తెలంగాణలో ఎక్కున రోజులు ఉండనుండడంతో రాష్ట్రంలో పార్టీకి పునరుజ్జీవం తెచ్చేందుకు వినియోగించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ భావిస్తున్నారు.

నేతల ఐక్యతపై ఆశలు..
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.. ఇదే ఆ పార్టీకి లాభం, నష్టమూ. ఎవరికి వారు ఇష్టానుసారం మాట్లాడడం, అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకపోవడం ఆ పార్టీ పతనానికి కారణమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు నడుస్తోంది. సీనియర్లు ఎవరికి వారు తమ వర్గాలతో రాజకీయం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి వెంట టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు నడుస్తుంగా, సీనియర్లు వీహెచ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీగౌడ్, జగ్గారెడ్డి తదితరులు కూడా తమ వర్గాలను రక్షించుకుంటూ పీసీసీ అధ్యక్షుడిపై అసమ్మతి ప్రకటిస్తున్నారు. అయితే అధిష్టానం పిలిచినపుపడు మాత్రం ఢిల్లీ వెళ్లి అంతా ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణకు తిరిగి రాగానే మళ్లీ వర్గాలుగా విడిపోతున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్‌లో గందరగోళం నెలకొంటోంది. ప్రజలు పార్టీని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. తెలంగాణలో కాంగ్రెస్ జోడో చేయాలని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశలో నాలుగు రోజులే..
ఇక రాహుల్ పాదయాత్ర ఆంధ్రప్రదేశలో నాలుగు రోజులు మాత్రమే సాగనుంది. రాయదుర్గం, ఆలూరు, ఆధోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 100 కిలోమీటర్లు సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపు పతనమైంది. పార్టీ ఓటు బ్యాంకు మొత్తం వైఎస్‌ఆర్‌సీపీకి వెళ్లిపోయింది.

దానిని తిరిగి తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. అయితే రాహుల్ పాదయాత్రను ఉపయోగించుకుని పార్టీని బలపరిచే నేతలు అకడ లేకపోవడమే కాంగ్రెస్‌కు ఇబ్బందికరం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ఆశలు పెద్దగా లేకపోయినా.. తెలంగాణపై మాత్రం ఆ పార్టీ అధిష్టానం భారీగా ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆదరించాలని పదే పదే ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో ఆదరణ ఉంటుందని.. ఆయన పాదయాత్ర తర్వాత పరిస్థితులు మారిపోతాయన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.