HMPV : మరోసారి దేశంలో లాక్ డౌన్ విధించబడుతుందా.. దీని పై చాలా మంది ఆందోళన చెందుతున్నారు. చైనాలో కొత్త వైరస్ వచ్చిందనే వార్తతో భారత్ తో పాటు ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ కొత్త వైరస్‌తో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటికే, జపాన్‌లో వేల కొద్దీ కేసులు నమోదవుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఇండియాలో కూడా సుమారు పది కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ముంబైలో జనవరి 9 నుండి 12 వరకూ లాక్ డౌన్ విధిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తేంటే.. త్వరలోనే దేశవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ తప్పదా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం, కొత్త వైరస్ ఒకటి చైనా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్న వార్త ప్రచారంలో ఉంది. సోషల్ మీడియా అంతా దీనికి సంబంధించిన సమాచారం వైరల్ అవుతోంది. వైరస్ బారినపడిన పేషెంట్లతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కొవిడ్-19 విజృంభించిన సరిగ్గా ఐదేళ్లకు చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీని పేరే హ్యూమన్ మెటాన్యుమోవైరస్-HMPV. ఈ వైరస్ అతి వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్, స్మశాన వాటికలు కిక్కిరిసిపోతున్నాయని అంటున్నారు. జపాన్‌లో కూడా వైరస్ విజృంభిస్తోందని తెలుస్తోంది. మరోవైపు, భారత్‌లో తాజాగా ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. 14 ఏళ్లలోపు పిల్లకు, వృద్ధులకు ఈ వైరస్ ప్రమాదకరమని చెబుతున్నారు అసలు ఇది ఎందుకింత భయపెడుతోంది. గతంలో కరోనా మహమ్మారి ప్రారంభమై ప్రపంచాన్ని కుదిపేసిన పరిస్థితి గుర్తుకు తెస్తుంది. ఈ కొత్త వైరస్‌పై చైనా హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది మాత్రం ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. అయితే, తాజా పరిస్థితులను ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ ఆఖరి వారంలో ఇన్ఫెక్షన్‌తో చైనా ఆసుపత్రులు కిక్కిరిసినట్లు డేటా చెబుతోంది. నిజానికి శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి అనేక రోగాలు వెలుగులోకి వస్తాయనీ.. ఇందులో భాగంగానే, ఈ ఏడాది మరిన్ని ఎక్కువ కేసులు వచ్చాయని ఆ దేశం చెబుతోంది.
2019 డిసెంబర్‌లో పొరుగు దేశం చైనాలో కరోనా మహమ్మారి మొదలై మూడు నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. అంతర్జాతీయంగా ప్రజల జీవనశైలిని మార్చేసిన ఈ మహమ్మారి భయంతో మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం అన్ని చర్యలు ముందుగా చేపట్టాలని చెబుతున్నారు. HMPV వైరస్ విస్తరణపై నియంత్రణ చర్యలు తీసుకోకపోతే లాక్ డౌన్ పరిస్థితులు మళ్లీ రావొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో దేశంలో లాక్ డౌన్ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. దేశంలోకి hMPV ప్రవేశించడంతో కేంద్రం లాక్ డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం ‘లాక్డౌన్’ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టి ఆసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం ఆలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏది నమ్మొద్దని ప్రజలకు సూచించింది.