
ISIS-K Terrorist in Afghan: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో విమానాశ్రయంపై జరిపిన బాంబు దాడిలో ఏకంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 150 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత దారుణానికి తెగబడిన ఉగ్రవాద సంస్థే ఐసిస్-కె. ఇప్పుడు ఉగ్ర సంస్థ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఐఎస్ఐఎస్ గురించి చాలా మందికి తెలుసు. కానీ.. ఐఎస్ఐఎస్-కె సంస్థ గురించి చాలా మందికి తెలియదు. తాలిబన్లను మించిన క్రూరత్వాన్ని ప్రదర్శించిన ఈ ఉగ్ర మూకల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు ‘కె’ తగిలించుకున్న ఈ గ్రూపు ఒకరకంగా ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టిందే అని అనుకోవచ్చు. ప్రస్తుత ఈశాన్య అఫ్ఘనిస్తాన్, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ తుర్కెమెనిస్తాన్ లోని ప్రాంతాలను కలిపి గతంలో ‘ఖొరాసన్’ అని పిలిచేవారు. ఈ సంస్థ ప్రధాన స్థావరం ఈ ప్రాంతంలోనే ఉంది. దీంతో.. ఐసిస్-కె అని తమ ఉగ్రసంస్థకు పేరు పెట్టుకున్నారు. అత్యంత క్రూరంగా దాడులు చేస్తారని, మనుషుల ప్రాణాలు తీస్తారని ఈ సంస్థకు పేరుంది. పాకిస్తాన్ లోని తాలిబన్ సంస్థ నుంచి కొందరు అత్యంత కరుడుగట్టిన భావజాలం ఉన్నవారు ఇందులో చేరిపోయారు.
వీరితోపాటు సిరియా నుంచి వచ్చిన కొందరు ఉగ్రవాదులు కూడా ఈ గుంపులో ఉన్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా. ప్రస్తుతం ఈ గ్రూపులో సుమారు 3 వేల మంది వరకు సభ్యులు ఉండొచ్చని భావిస్తున్నారు. 2014 నుంచి వీరి కార్యలాపాలు ఆఫ్ఘన్ లో మొదలయ్యాయి. వీరి ప్రధాన లక్ష్యం ముస్లింలలోని షియా తెగకు చెందిన హజారాలు. ఈ తెగకు చెందిన వారు కనిపిస్తే.. విచక్షణ కోల్పోయి దాడులు చేస్తారు. 2020లో ఆఫ్ఘనల్లో షియా జాతికి చెందిన వారు నివసించే ప్రాంతంలో దారుణంగా కాల్పులకు తెగబడి 25 మందిని పొట్టన పెట్టుకున్నారు. వీరిలో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నారు. ఇంత దారుణంగా అకృత్యాలకు ఒడిగడుతుంటుందీ ఉగ్రమూక.
ఈ సంస్థ బలపడకుండా అమెరికా దాడులు చేస్తూ వచ్చింది. గడిచిన ఆరు సంవత్సరాల్లో ఏడుగురు అగ్రనేతలను హతమార్చింది. అయినప్పటికీ.. వీరు ఎప్పటికప్పుడు కొత్త నాయకుల ఆధ్వర్యంలో ముందుకు సాగుతూనే ఉన్నారు. అయితే.. వీరికి, తాలిబన్లకు పడదు అని చెబుతారు. కాబూల్ విమానాశ్రయంలో ఐసిస్-కె జరిపిన దాడిని తాలిబన్లు ఖండించారు. కానీ.. అంతర్గతంగా ఈ రెండు ఉగ్రసంస్థలు కలిసే పనిచేస్తాయని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు అనుమానిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఐసిస్-కె జరిపిన పలు దాడులకు తాలిబన్ నెట్ వర్క్ హక్కానీ నుంచి సహకారం అందినట్లు భావిస్తున్నాయి.
ఇప్పటికే తాలిబన్లతో బెంబేలెత్తిపోతున్న ఆఫ్గన్లు.. ఇప్పుడు ఐసిస్-కె దాడులతో బలైపోతున్నారు. మరి, ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో? ఆఫ్ఘన్ల జీవితాల్లో కొత్త వెలుగు ఎప్పుడు వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.