Kabul airport blasts: కాబూల్ (Kabul) నగరం బాంబులతో (Bomb Blast) దద్దరిల్లింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ చర్యతో దేశం యావత్తు ఉలిక్కిపడింది. తాలిబన్లు (Taliban) అనుమానించినట్లుగానే ఐఎస్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల బాధ్యత తమదేనని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. పేలుళ్లలో దాదాపు 60 మంది మరణించగా 150 మంది గాయపడ్డారు. మొదటి పేలుడు బారన్ హోటల్ వద్ద, రెండో పేలుడు కాబుల్ విమానాశ్రయం వద్ద జరిగాయి. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అఫ్గాన్ పేలుళ్లకు (afghan blasts) తమదే బాధ్యత అని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఫొటోను కూడా విడుదల చేశారు. ఈ రెండు పేలుళ్లతో పాటు మరో రెండు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొంది. మూడో పేలుడు తాలిబన్ వాహనాన్ని పేల్చివేసిందని తెలిపింది. మృతుల్లో నలుగురు యూఎస్ మెరైన్స్ కూడా ఉన్నారు. ముగ్గురు అమెరికా సైనికులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్షుడు జో బైడెన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొన్నారు.
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపించాయి. విమానాశ్రయం మొత్తం దద్దరిల్లిపోయింది. భీతావహ వాతావరణం నెలకొంది. ఎవరి దేశాలకు వారు వెళ్లేందుకు జనం పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడడం తెలిసిందే.
ఆగస్టు 31వరకు తరలింపు గడువు విధించడంతో వేలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. గురువారం ఉదయం ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా వర్గాలు వెల్లడించడంతో కొద్ది గంటల సమయంలోనే ఉగ్రవాదులు దాడులకు తెగబడటం సంచలనమైంది.
అమెరికా ఇప్పటికే ఉగ్రదాడి జరగవచ్చని హెచ్చరించిన నేపథ్యంలో పేలుళ్లు జరగడంతో పౌరులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాద దాడులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. సిగ్గుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నారు. నిందితులను చట్టం ముందు నిలబెడతామని తాలిబన్ అధికార ప్రతినిధి మహిల్ షాహిన్ పేర్కొన్నారు.