Vijayasai Reddy- ACA Election: ఆంధ్రాలో కబ్జా రాజకీయాలకు తెరలేపారు అధికార వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉదయం లేవగానే చంద్రబాబుపై కబ్జాకోరు, అవినీతి పరుడు, మళ్లీ ముఖ్యమంత్రి కాడు అంటూ విరుచుకుపడే విజయసాయి.. తాను చేస్తున్న కబ్జాల గురించి మాత్రం స్పందించరు. ఇప్పటికే విశాఖలో రుషికొండను కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన అల్లుడి సోదరుడికి ఉచ్చు బిగుస్తోంది. అయినా తన కబ్జాలు మాత్రం విజయసాయి ఆపడం లేదు. తాజాగా ఆంధ్ర క్రికెట్ సంఘంపై కన్నేశారు. అసోసియేషన్‌ను బంధువులు, వ్యాపార బినామీలతో నింపేయడానికి స్కెచ్ వేశారు. కానీ, ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎన్నికల్లేకుండా ఏకగ్రీవంగా పదవులు కైవసం చేసుకుందామనుకున్న విజయసాయికి చివరి క్షణంలో హైకోర్టు బ్రేక్ వేసింది. ఏసీఏ ఎన్నికలపై స్టే ఇచ్చింది.

అక్రమాలపై హైకోర్టులో పిటిషన్..
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలు జరిగాయంటూ చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్రమాల వివరాలన్నింటినీ కోర్టు ముందు ఉంచారు. 2019 నుంచి మూడేళ్లపాటు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆయన పదవీ కాలం 2022, సెప్టెంబర్ 26న పూర్తయింది. ఆ రోజు నుంచి శరత్ చంద్రారెడ్డికికానీ పాలకమండలిలలో ఉన్న వారికి కానీ ఏసీఏలో ఎలాంటి అధికారాలు లేవు. కానీ మరసటి రోజునే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసిం ఎలక్టోరోల్ ఆఫీసర్‌ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న పాలక మండలినే మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకునేలా నామినేషన్స్ వేయించారు. క్రికెట్ పాలనా వ్యవహారాల్లో సుప్రీంకోర్టు నియమించిన లోథా కమిటీ సిఫార్సులు, అంబుడ్స్‌మెన్ నియామకంలో నిబంధన పాటించకపోవడాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టు నిర్ధేశించిన నియమాల్లో దేన్నీ పాటించలేదని తెలిపారు. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 13 మంది ఓటు వేయాల్సింది. 15 మంది సోషల్ క్లబ్ మెంబర్స్‌కి ఓటు హక్కు లేదని తెలిసినా.. వారికి ఓటు హక్కు ఇప్పించి అక్రమంగా విజయం సాధించారు. ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఎలక్టోలర్ ఆఫీసర్ చెప్పినందున ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.

ఎన్నికలపై స్టే..
ఏకగ్రీవంగా పదవులు దక్కించుకుని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ను ఏలేద్దామనుకున్న విజయసాయికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసోసియేషన్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినందున, కొన్ని ఆధారాలను కూడా పిటిషనర్ కోర్టుకు సమర్పించినందున ఎన్నికల ఫలితాల ప్రకటన నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతటితో ఆగకుండా కేసు తేలే వరకు ఎన్నికల ఫలితాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 14కి వాయిదా వేశారు. దీంతో ఫలితాలకు ఒక్క రోజు ముందు హైకోర్టు ఇచ్చిన స్టేతో విజయసాయి దూకుడుకు బ్రేక్ పడింది.