ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు హైకోర్టు చేత అంక్షితలు వేయించుకున్నారు. జగన్ సర్కార్ రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధంగా బిల్లులు చేయడం.. దానిపై ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించడం.. కోర్టు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇటీవల కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి కోర్టులో ప్రతీసారి ఎదురుదెబ్బలు తగలడం ఆయనకే చెందెందేమో అనిపిస్తోంది. ప్రతీసారి జగన్ పై సీరియస్ అయ్యే హైకోర్టు ఈసారి పోలీస్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?
ఏపీలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ అమలు కాకపోవడంపై మండిపడింది. గతంలోనూ కోర్టు డీజీపీని హాజరు కావాలని పిలిచినా రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ వ్యవస్థ తీరు ఇలానే కొనసాగిస్తే డీజీపీను తప్పించాల్సి వస్తోందంటూ హైకోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది.
అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అదృశ్యమయ్యాడు. దీనిపై వెంకటరాజు మేనమామ సుంకర నారాయణ స్వామి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. దీంతో వెంటకరాజు ఆచూకీ చూపాలంటే హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా పోలీసులు దీనిని పెద్దగా పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనూ ఏపీ పోలీసులు ఇలానే వ్యవహరించారని పేర్కొంది.
గతంలో పోలీసులపై వచ్చిన ఆరోపణలపై జ్యుడిషియల్ విచారణ చేస్తే మూడు కేసుల్లో పోలీసులదే తప్పు అని తేలిందని స్పష్టం చేసింది. పోలీసుల తీరుతో ప్రభుత్వానికి ఇబ్బంది వస్తోందంటూ హైకోర్టు ఆక్షేపించింది. ప్రతీసారి పోలీసులు కోర్టును సైతం లెక్క చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ కేసు కూడా సీబీఐకి ఇవ్వడం కుదరని తేల్చిచెప్పింది. పోలీస్ వ్యవస్థ తీరు ఇలానే ఉంటే ఏపీ డీజీపీని తప్పించాల్సి వస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికైనా పోలీసుల తీరు మారుతుందో లేదో వేచిచూడాల్సిందే..!
Also Read : బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు