Telangana Rains: తెలంగాణలో వర్షాలు మరోమారు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే వర్షాలతో జనం అతలాకుతలం కావడంతో సర్కారు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా లక్షలాది ఎకరాలు నీటిలో మునిగిపోయినా ఇంతవరకు ఎలాంటి సాయం మాత్రం రైతులకు అందలేదు. సరికదా కనీసం పరామర్శలు సైతం లేవు. దీంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మరో ఐదు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఉన్న పంటలు కూడా మొత్తం నీటిలో మునిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

నైరుతి రుతుపవనాలతోపాటు ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 27 వరకు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణ జిల్లాలైన గ్రేటర్ హైదరాబాద్, మహబూబాబాద్, సూర్యపేట, జనగామ, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది.
Also Read: AP CM Jagan: ఆ ఐదుగుర్నీ ఓడించాలన్న కసితో ఏపీ సీఎం జగన్…సాధ్యమయ్యేనా?
హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రహదారులు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా అవుతోంది. ఎటు వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి. అమీర్ పేట, పంజాగుట్ట, కూకల్ పల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది. దీంతో నాళాలు పొంగిపొర్లుతున్నాయి. హుసేన్ సాగర్ నీటిమట్టం గరిష్టంగా చేరుకుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ఈ సంవత్సరం జలప్రళయం వచ్చే అవకాశముంది. ఇదివరకే చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నిండిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలు పూర్తిగా నీటిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు తమ ఆశలు వదులుకోవాల్సిందే. పత్తి, మొక్కజొన్న, కంది, పెసర ఏ పంట అయినా నీటిలో మునిగిపోవాల్సిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఇస్తామని మాత్రం ఇదివరకు ప్రకటించలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యానికి తమ పెట్టుబడులు కాస్త హరీ మంటున్నాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఏమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
Also Read:Jagan Politics : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఓడించడం జగన్ కు సాధ్యమవుతుందా?