Heavy Rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వర్షప్రభావంతో జరిగే నష్టాలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ఏపీ విపత్తుల సంస్థ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. భారీ వర్షాలు పొంచి ఉన్నందున వరద ముంపు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చింది. దీంతో ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించింది. ఏదైనా ప్రమాదమని తెలిస్తే తక్షణమే 1070, 18004250101, 08632377118 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందజేయాలని తెలిపింది.
Also Read: Early Elections in AP: ఏపీలో ఆరు నెలల ముందే ఎన్నికలు.. సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలు
భారీ వర్షాలు పడే అవకాశమున్నందున అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వరద ముంపు ఉన్న ప్రాంతాలను అలర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత పదేళ్లుగా నమోదు కాని వర్షపాతం ప్రస్తుతం నమోదు కావడం సంచలనం కలిగిస్తోంది. జులై నెలలో ఇంత భారీ వర్షాలు పడటం పదేళ్లలో ఇదే తొలిసారి.
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రమాదాల్లో చిక్కుకోవడం జరుగుతున్నందున ఎవరు కూడా బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో ఈనెల 11న జరగాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో నిర్వహించాల్సిన సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఈనెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులు కూడా వాయిదా వేసినట్లు సీఎం తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

సీఎస్ సోమేశ్ కుమార్, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అందరు విధిగా స్థానికంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షించాలని సూచిస్తున్నారు. ఏదైనా ప్రమాదమని తెలిస్తే వెంటనే ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు సోమవారం కూడా ఉన్నందున అధికార యంత్రాంగం జాగ్రత్తగా ఉంటూ ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
[…] […]