Heatwave Alert: దేశంలో వేసవి సెగలు మొదలయ్యాయి. భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్చి(March)లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. మార్చి మధ్యలో ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చని ఐఎండీ(IMD)అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో మార్చి 19 వరకు వేడిగాలులు (హీట్ వేవ్) వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో ఈ నెల మొదటి వారంలోనే 39.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైందని, మార్చి 19 వరకు వేడి తీవ్రత కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: మిగతా జట్ల లాగా.. SRH కు కూడా కెప్టెన్ ను మార్చేస్తే..
రాబోయే ఐదు రోజులు..
ఈ ఐదు రోజులు (మార్చి 15 నుంచి 19 వరకు) జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఎందుకంటే, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు, ముఖ్యంగా పొడి, ఎడారి ప్రాంతాల్లో. ఇటీవలి సంవత్సరాల్లో మార్చి నెలలో ఉష్ణ తీవ్రత పెరుగుతున్నది. దీనికి వాతావరణ మార్పులు, ఎల్ నినో–లా నినా(el nilo-La nino)పరిస్థితులు కారణం కావచ్చు. ఈ వేడి వల్ల ఆరోగ్య సమస్యలు (హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్) వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని తెలిపింది.
జాగ్రత్తలు..
నీరు ఎక్కువగా తాగడం: రోజుకు కనీసం 3–4 లీటర్ల నీటిని తీసుకోండి.
ఎండలో బయటకు వెళ్లకపోవడం: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో తిరగడం తగ్గించండి.
తేలికైన దుస్తులు: గాలి ఆడే, లేత రంగు కాటన్ బట్టలు ధరించండి.
ఆరోగ్య జాగ్రత్త: వద్ధులు, పిల్లలు మరియు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఇంట్లోనే ఉండటం మంచిది.
ఎండకు బయటకు రావొద్దు.. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని తెలిపింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అత్యవసరమైతే..
మధ్యాహ్నం వేళల్లో అత్యవరమై బయటకు రావాల్సి వస్తే తలకు రుమాలు లేదా గొడుగు పట్టుకుని రావాలని సూచించింది. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా చూసుకోవాలని తెలిపింది.
Also Read: పాక్ పరువు సింధు నది పాలు.. ఈసారి ఏం జరిగిందంటే..