
తెలంగాణలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ ను తొలగించాక.. కీలకమైన ఆ శాఖలో ఎవరిని పెడుతారన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఈ కరోనా కల్లోల వాతావరణంలో ఆ శాఖను చూడడం అంటే కత్తిమీద సామే. అన్ని వ్యవస్థలపై అధికారం ఉంటేనే అది సాధ్యం. అందుకే తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి బలమైన నేత కేటీఆర్ కే ఈ వైద్యఆరోగ్యశాఖను అప్పగించబోతున్నారని టాక్ నడుస్తోంది.
ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న కేటీఆర్ తాజాగా కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యాడు. ఆ తర్వాత పలు సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు వైద్యఆరోగ్యశాఖను కేటీఆర్ కు ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వైద్యఆరోగ్యశాఖ సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అవసరం ఎంతో ఉంది. కరోనా కాలంలో ప్రతీ అంశాన్ని మంత్రి చూసుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ క్షేత్ర స్థాయికి వెళ్లి చూసుకునే పరిస్థితి లేదు. ఇక ఆయన స్థానంలో బలమైన వ్యక్తికి వైద్య ఆరోగ్యశాఖ ఇవ్వాలని చూస్తున్నారు. కేటీఆర్ అయితేనే దాన్ని సమర్థంగా నిర్వహిస్తాడని.. ఆయనకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కేసీఆర్ ఏర్పాటు చేశారు. దానికి కేటీఆర్ ను లీడ్ చేయాలని ఆదేవించారు. దీంతో కేటీఆర్ వెంటనే ఆ టాస్క్ ఫోర్స్ భేటి ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రులన్నింటిపై ప్రభుత్వం నియంత్రణ ఉంటుందని ప్రకటించారు.
కరోనా కల్లోలంలో వైద్య ఆరోగ్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రజలకు చికిత్స అందే విషయంలో కేటీఆర్ ఏదైనా విప్లవాత్మక చర్యలు తీసుకుంటే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. అలాగే మంచి పేరుకూడా సంపాదిస్తారు. సౌకర్యాలను సమర్థంగా అందించగలిగితే చాలు.. కేటీఆర్ కు ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ శాఖ ద్వారా భవిష్యత్ నేతగా పేరు సంపాదించే అవకాశం ఏర్పడుతుంది.
ఇప్పటికే తెలంగాణలో కరోనా నియంత్రణలో సర్కార్ విఫలం అయ్యిందని హైకోర్టు తూర్పారపడుతోంది. జిల్లాల్లో పాజిటివిటీ రేటు విపరీతంగా మారుతోంది. టెస్టులు తక్కువగా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలో వైద్యఆరోగ్యశాఖను కేటీఆర్ తీసుకుని వాటిని సెట్ రైట్ చేస్తే భవిష్యత్ సీఎంగా కూడా కేటీఆర్ కు కీర్తినందించే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..