
కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో కరోనా వైరస్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలలో ఏ వార్త నిజమని నమ్మాలో ఏ వార్త అబద్ధమని నమ్మాలో పజలకు అర్థం కావడం లేదు. వైరల్ అవుతున్న వార్తలను నమ్మి కొంతమంది ప్రాణాలకే అపాయం తెచ్చుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు వేడినీళ్లు తాగినా, వేడినీళ్లతో స్నానం కరోనాకు చెక్ పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.
అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి కేంద్రం స్పష్టతనిచ్చింది. 60 నుంచి 75 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ప్రత్యేక పద్ధతుల్లో మాత్రమే కరోనా వైరస్ చనిపోతుందని వేడినీళ్లు తాగడం వల్ల కరోనాను చంపడం లేదా తగ్గించడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. అయితే వేడినీళ్ల శరీరానికి ఎంతోకొంత ఉపశమనం మాత్రం లభిస్తుందని శాస్త్రవేత్తలు, వైద్యులు వెల్లడిస్తుండటం గమనార్హం.
వేడినీళ్లతో స్నానం చేస్తే ఒళ్లునొప్పులు తగ్గుతాయని మెదడు ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. వేడినీళ్లు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లలో ఉప్పు, పసుపు వేసి పుక్కలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా ఉండటం సాధ్యమవుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనాకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.