Havana Syndrome: ఇంత కాలం కరోనా వైరస్ తోనే కాలం వెళ్లదీస్తున్నాం. వైరస్ ధాటికి ప్రపంచమే కుదేలైపోతోంది. మొదటి, రెండో దశల్లో మనుషులు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పటికి కూడా దాని సెగ తగులుతూనే ఉంది. కొత్త వేరియంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో హవానా సిండ్రోమ్ అనే కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. కానీ అది కేవలం దౌత్యవేత్తలకే సోకడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై అమెరికా ఆందోళన చేస్తోంది. తమ రాయబారులను పట్టిపీడిస్తున్న సమస్యపై దృష్టి సారించింది.
ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ కూడా దీని బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వియత్నాం పర్యటన కొన్ని గంటల పాటు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వ్యాధికి మూల కారణం ఏంటనే దానిపై స్పష్టమైన అవగాహన లేకుండా పోతోంది. వియత్నాంలో అమెరికా దౌత్య సిబ్బంది ఇళ్ల వద్ద కూడా ఎలాంటి అంతుచిక్కని దాడికి గురైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా తల బాదుకుంటోంది.
2016లో తొలిసారిగా క్యూబా రాజధాని హవానా నగరంలో అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిలో గుర్తించారు. ఇక్కడ వెలుగు చూడడంతో దీనికి హవానా సిండ్రోమ్ అనే పేరు పెట్టారు. దీనికి గురైన వారికి తీవ్రమైన ఒత్తిడి, భరించలేని తలనొప్పి, వికారం, తలపోటు, నిస్సత్తువ, కళ్లు తిరగం, నిద్ర లేమి, వినికిడి లోపం, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో చాలా మంది బాధితులకు వినికిడి శక్తి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
క్యూబా, చైనా దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వారిలోనే ఈ వ్యాధి బాధితులు ఉన్నట్లు సమాచారం. దౌత్యవేత్తలు, రాబారులు, గూఢచారులు, సైన్యం, సీఐఏ సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారులే లక్ష్యంగా ఈ వ్యాధి సోకుతున్నట్లు చెబుతున్నారు. గత ఐదేళ్లలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. జర్మనీ, ఆస్రేలియా, తైవాన్, ఆస్రియా, రష్యా, అమెరికా దౌద్య సిబ్బంది దీని బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వంటి వాటిని వాడటంతోనే ఇలా జరుగుతుందని ఓ వాదన లేకపోలేదు.
గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్యూబాపై ఆరోపణలు చేశారు. తమ దౌత్య సిబ్బందికి ఈ వ్యాధి అంటుకోవడానికి కారణం వారే అని నిందించారు. దీంతో క్యూబా సిబ్బందిని బహిష్కరించారు. క్యూబా, రష్యాలతోనే ఇలా జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను క్యూబా తిరస్కరించింది. అయినా ఈ వ్యాధి సంక్రమణపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో అనే సంశయం అందరిలో నెలకొంది.