Haryana Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. కానీ వాస్తవ ఫలితాలు అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అక్కడ హ్యాట్రిక్ దిశగా పరుగులు తీస్తోంది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. అయితే హర్యానాలో మంగళవారం జరుగుతున్న ఎన్నికల ఫలితాలలో సంచలనం నమోదయింది.. కుస్తీ పోటీ యోధురాలు వినేష్ ఫొగాట్ సంచలన విజయం సాధించింది. వాస్తవానికి ఉదయం ప్రారంభమైన ఫలితాలు అనుక్షణం తారుమారవుతున్నాయి. ప్రతిక్షణం రౌండ్ రౌండ్ కూ ఆధిక్యాలు మారిపోతున్నాయి. అయితే ఇప్పుడే తుది గెలుపు ఎవరిది అనేది చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చాలాచోట్ల నువ్వా నేనా అన్నట్టుగా పోటీ కొనసాగుతోంది. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. జులానా నియోజవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థి యోగేష్ కుమార్ పై ఘనవిజయం సాధించింది. 5,763 ఓట్ల తేడాతో అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. ఫలితాల వెల్లడి ప్రారంభమైన క్షణం నుంచి వినేష్ లీడ్ కొనసాగించింది. మధ్యలో కాస్త వెనుక పడ్డప్పటికీ.. ఆ తర్వాత పుంజుకుంది. విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తొలిసారి అసెంబ్లీకి..
ఈ విజయం ద్వారా వినేష్ తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనుంది. వినేష్ గత ఏడాది భారత రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. అప్పట్లో ఆమె ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది . ఇటీవలి పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫైనల్ పోటీకి అర్హత సాధించలేకపోయింది. బరువు కారణంగా ఆమె తోది పోటీలలో పాల్గొనలేకపోయింది. దీనిపై రకరకాల వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత వినేష్ భారత రెజ్లింగ్ సమాఖ్య అంతర్జాతీయ ఆర్బిట్రేట్ ను ఆశ్రయించినప్పటికీ ఉపయోగలేకుండా పోయింది. దీంతో వినేష్ పారిస్ నుంచి ఇండియాకు వచ్చింది. అప్పట్లో ఆమె వెంట కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి ఆమె ఇంటి వరకు తోడుకొని వెళ్లారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వినేష్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. జులానా నియోజవర్గంలో పోటీ చేసి.. గెలిచింది.
హోరాహోరీగా లెక్కింపు
ప్రస్తుతం హర్యానాలో ఓట్ల లెక్కింపు హోరాహోరిగా సాగుతోంది. చాలా స్థానాలలో కాంగ్రెస్ – బిజెపి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. హర్యానా రాష్ట్రం లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి బిజెపి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి.. లీడ్ లో కొనసాగుతోంది. మూడోసారి అధికారం చేపట్టి.. హ్యాట్రిక్ పార్టీగా అడుగులు వేస్తోంది. ఇక ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బిజెపి 50, కాంగ్రెస్ 34, ఇతరులు ఆరు స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నారు.