Brahmamudi: స్టార్ మా తెలుగులో టాప్ ఛానల్. ఈ ఛానల్ లో ప్రసారమైన పలు సీరియల్స్ రికార్డు రేటింగ్ రాబట్టాయి. వాటిలో కార్తీక దీపం ఒకటి. ఈ సీరియల్ నేషనల్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. కాగా కార్తీక దీపంకి ఎండ్ కార్డ్ వేసిన స్టార్ మా, ఆ సీరియల్ స్థానంలో బ్రహ్మముడి తీసుకొచ్చింది. 2023 జనవరి నుండి బ్రహ్మముడి స్టార్ మాలో ప్రసారం అవుతుంది. కార్తీక దీపం స్థాయిలో కాకపోయినా.. బ్రహ్మముడి కూడా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటుంది.
బ్రహ్మముడి సీరియల్ కి కావ్య-రాజ్ పాత్రలు ప్రధాన బలం. వీరిద్దరి మధ్య చోటు చేసుకునే గిల్లికజ్జాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ పాత్రలను దీపికా రంగనాథ్, మానస్ చేస్తున్నారు. ఈ సీరియల్ లో ప్రేక్షకులకు ఇష్టమైన మరో పాత్ర స్వప్న. ఈ పాత్రను హమీద ఖాతూన్ చేస్తుంది. గడసరి కోడలిగా స్వప్న పాత్రలో హమీద సూపర్ అని చెప్పాలి. తన అత్త, భర్తలను ముప్పు తిప్పలు పెడుతుంది.
నెగిటివ్ షేడ్స్ తో పాటు పాజిటివ్ షేడ్స్ కలిగినది స్వప్న పాత్ర. బ్రహ్మముడి సీరియల్ కి కీలకమైన ఈ పాత్ర నుండి హమీద తప్పుకుంది. హమీద స్థానంలో మరొక నటి కనిపిస్తుంది. హమీద బ్రహ్మముడి సీరియల్ నుండి ఎందుకు తప్పుకుందో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు. అదే సమయంలో ఆమె సీరియల్ నుండి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతున్నారు.
హమీదకు బిగ్ బాస్ తెలుగు 8లో ఆఫర్ వచ్చింది. మాజీ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ద్వారా పంపిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో.. హమీద ఈ కారణంగానే సీరియల్ కి గుడ్ బై చెప్పిందంటూ.. వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆదివారం బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ తో దానిపై స్పష్టత వచ్చింది. హమీదకు బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కలేదు. ఆమెకు సినిమాలు, ఇతర ప్రాజెక్ట్స్ లో అవకాశాలు రావడం వలనే, మానేశారనే మరో వాదన వినిపిస్తోంది.
ఇక బ్రహ్మముడి సీరియల్ సెట్స్ లో హమీద చివరి రోజు ఎమోషనల్ సీన్ చోటు చేసుకుంది. హమీదను పట్టుకుని దీపికా రంగనాథ్ ఏడ్చేసింది. దీపికా రంగనాథ్ కన్నీళ్లను హమీద తుడుస్తోంది. ఈ వీడియోను బ్రహ్మముడి సీరియల్ లో ప్రకాష్ పాత్ర చేస్తున్న నటుడు గిరి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది.