Mumbai : ముంబైలోని విశ్వవిఖ్యాతమైన లాల్ బాగ్చా రాజా గణపతి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాదిమందిగా భక్తులు వస్తుంటారు. ఇక గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో అయితే ఇసుక వేస్తే రాలనంత భక్తులు వస్తుంటారు. గంటల తరబడి ఎదురు చూసైనా సరే స్వామివారి ముందు నిలబడి దర్శించుకుంటారు.. గణపతి నవరాత్రి ఉత్సవాలకు భారీగా భక్తులు వస్తుంటారు. ఇక రాజకీయ నాయకులు, సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఆలయంలో కొంతకాలంగా విఐపి సంస్కృతిని అమలు చేస్తున్నారు. దీనిపై అనేక రకాలుగా విమర్శలు వస్తున్నప్పటికీ ఆలయ కమిటీ తీరు మార్చుకోవడం లేదు. అయితే ఈ వ్యవహారంపై దేశంలో బడా బిలియనీర్లలో ఒకరైన హర్ష్ గోయంకా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆలయంలో జరుగుతున్న వీఐపీ విధానాన్ని ప్రశ్నించారు..
లాల్ బాగ్చా రాజా గణపతి ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ కొలువై ఉన్న స్వామి వారు అందరికీ దర్శనమియ్యాలి. స్వామివారి దృష్టిలో భక్తులు అందరూ సమానమే. కానీ ఆ స్వామివారి దర్శనం అందరికీ సమానంగా లభించడం లేదు. అసలు ఆ ఆలయంలో విఐపి సంస్కృతి ఎందుకు అమలు చేస్తున్నారు కమిటీ వారు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి పద్ధతి వల్ల సామాన్య భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రద్దీ చోటు చేసుకోవడం వల్ల దర్శనం కాలేక నరకం చూస్తున్నారు. ఇది అసమానతలకు పూర్తిస్థాయిలో అద్దం పడుతోంది. భక్తి అనేది సమానం కాదా? ఇందులో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయని” హర్ష్ గోయంకా ప్రశ్నించారు. ట్విట్టర్ ఎక్స్ లో ఆయన షేర్ చేసిన వీడియోలో లాల్ బాగ్చా రాజా గణపతి ఆలయం లో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు ఎదురుచూస్తున్నారు. దర్శనం కోసం కాళ్లకు పని చెబుతున్నారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. భక్తుల దుస్థితిని హర్ష్ గోయంకా వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు.
లాల్ బాగ్చా రాజా గణపతి ఆలయం లో పరిస్థితిపై హర్ష్ గోయంకా ట్విట్టర్ ఎక్స్ లో వీడియోను పోస్ట్ చేసిన నేపథ్యంలో అది విస్తృతమైన వ్యాప్తిలోకి రావడం మొదలైంది. “విఐపి లకు మాత్రమే దర్శనం అని బోర్డు పెట్టండి. సామాన్య భక్తులు అప్పుడు రారు” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ ఆలయంలో రద్దీ పెరిగిన నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది భక్తులను తోసివేస్తున్నారు. ఒకవేళ వీఐపీ కుటుంబం కనుక దర్శనానికి వస్తే.. వారిని అనుమతిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన వ్యాప్తిలో ఉన్నాయి.