ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో హిందుత్వవాదుల మనసులకు గాయాలవుతున్నాయి. ఇది కుట్రపూరితమో.. లేక ఎవరైనా కావాలని చేస్తున్నారో తెలియదు కానీ.. వైఎస్ జగన్ సర్కార్ మాత్రం అభాసుపాలవుతోంది. తరుచుగా హిందూ ఆలయాలు, హిందుత్వ వాదులపై దాడులు కలకలం రేపుతున్నాయి.
Also Read: 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనదే హవా…. ఆ రెండు పార్టీలకు షాక్?
రెండు రోజుల కింద ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయితీ పరిధిలో ఈ అపచారం జరిగింది. వెంకటగిరిలోని వీధిలోని ఓ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి మలాన్ని పూసారనే ప్రచారం జరిగింది. అసాంఘిక శక్తులు కొందరు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బొమ్మూరు రేంజ్ డీఎస్పీ మాట్లాడుతూ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో అనుమానితులను గుర్తించామని నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఇప్పటికే అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలతో ఏపీ రాజకీయాల్లో వేడి పెరిగిపోయింది. ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ పాలనలో ఇలా జరుగుతున్నాయని రాద్ధాంతం చేస్తున్నాయి. జగన్ సర్కార్ పై వ్యూహాత్మకంగా జరుగుతున్న ఈ దాడులను నిగ్గుతేల్చాలని కూడా వైసీపీ సర్కార్ పట్టుదలగా ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని హిందుత్వంపై మచ్చగా మరో దాడి జరిగింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని శివాలయం దగ్గర ఉన్న శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగొట్టారు.
Also Read: జగన్ పాలన జనాలకు నచ్చడం లేదా..?
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విగ్రహాన్ని ధ్వంసం ఎవరు చేశారన్నది విచారణ జరుపుతున్నారు. కాగా ఘటన స్థలంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
వరుసగా ఏపీలో హిందూ ఆలయాలు, విగ్రహాలపై జరుగుతున్న దాడులు, అపచారాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. జగన్ సర్కార్ ను వెంటాడుతున్నాయి.