Homeఅంతర్జాతీయంగిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత , ప్రముఖ జర్నలిస్ట్ తుర్లపాటి ఇక లేరు

గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత , ప్రముఖ జర్నలిస్ట్ తుర్లపాటి ఇక లేరు

Turlapati Kutumbaraoఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంకు సెక్రెటరీగా పని చేశారు. జాతక కథలు, జాతి రత్నాలు, జాతి నిర్మాతలు, మహా నాయకులు, విప్లవ వీరులు, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు. నా కలం..నా గళం లాంటి పుస్తకాలను రచించారు. విదేశాల్లో 20,000లకు పైగా సభల్లో ఉపన్యాసాలు చేసిన తుర్లపాట గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు.

వర్తమాన కవిత్వంలో వచ్చిన మార్పులను వివరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన వ్యాసాలు.. వర్తమాన రాజకీయాలకు దర్పణాలు. సుదీర్ఘమైన అనుభవం కలిగిన తుర్లపాటి పద్మశ్రీ బిరుదుతోపాటు అనేక అవార్డులు, రికార్డులు ఆయన సొంతం. వండర్ బుక్ ఆఫ్ రికార్డు, అష్టాదశ సహస్రసభా కేసరి బిరుదు కూడా పొందారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు కొని నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది ముఖ్యమంత్రులతో తుర్లపాటి పనిచేశారు. ఆయన రాసిన ‘18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు’ అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అనితర సాధ్యుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు తుర్లపాటి కుటుంబారావు.

Also Read: వావ్.. 100 మిలియన్లు.. ఇంకా అదే ఊపు !

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (89) తుదిశ్వాస విడిచారు. ఆదివారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజాముణ కన్నుమూశారు.

బెజవాడ పాటిబండవారివీధిలో 1931 ఆగస్టు 10న తుర్లపాటి కుటుంబరావు జ‌న్మించారు. నాన్న సుందర రామానుజరావు. వీరి స్వగ్రామం పామర్రు. న్యాయవాద వృత్తిని కూడా కొనసాగించారు. ఆయ‌న అమ్మ శేషమాంబ. ఆమె కవయిత్రి, పాటల రచయిత్రి, భక్తురాలు. తుర్లపాటికి ఇద్దరు సోద‌రులు, ఒక అక్క, ఒక చెల్లెలు ఉన్నారు. ‘మాతృభూమి’ పత్రికలో ‘స్వరాజ్యంలో స్వాతంత్య్రం’ అనే ఆయ‌న‌ తొలివ్యాసం 1947 మార్చి 22న ప్రచురితమైంది. ఆయ‌న జీవిత భాగ‌స్వామి అయిన కృష్ణకుమారి కూచిపూడి నాట్యకళాకారిణి. అత‌నిది ప్రేమ వివాహం కాగా, కోల్‌కతాలో సన్మానం పొందటానికి రైల్లో వెళుతున్న స‌మ‌యంలో ఆమెతో ప‌రిచయం ప్రేమ‌గా మారింది. 1959 జూన్‌ 12న ఆయ‌న‌ వివాహం జరిగింది. 1979లో కేన్సర్‌ మహమ్మారి బారినపడి కృష్ణ కుమారి కన్నుమూశారు. ఆయ‌న భార్యపేరిట కృష్ణకళాభారతి సంస్థ స్థాపించి ఏటా కళా ప్రముఖులను సత్కరిస్తూ వ‌స్తున్నారు.

తుర్లపాటి కుటుంబరావుకు పాత్రికేయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు అనేక విషయాలపై విశ్లేషణలు చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు ప్రసిద్ధికెక్కారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరు గడించారు. జర్నలిస్టుగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం ప్రభుత్వం 2002లో ప్రతిష్టాత్మక పద్మశ్రీని అందించింది.

Also Read: అరె.. పూర్తిగా మారిపోయిన స్టార్ దర్శకుడు !

1951లో ఆచార్య ఎన్‌జీ రంగారావు వాహిని పత్రికలో మొదటిసారిగా కుటుంబరావు ఉప సంపాదకుడిగా పనిచేశారు. అనంతరం చలసాని రామారాయ్‌ ‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. రాజకీయలపై చేస్తున్న విశ్లేషణలను చూసి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన్ని చెన్నైకి పిలిపించి, తను నడుపుతున్న ప్రజాపత్రికలో సహాయ సంపాదకుడిగా నియమించారు. అంతేకాకుండా సహాయ సంపాదకుడితో పాటు ప్రకాశం పంతులుకు కార్యదర్శిగానూ ద్విపాత్రాభినయం చేశారు. అనంతర కాలంలో ఆంధ్రజ్యోతికి ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు.

మహత్మా గాంధీ విజయవాడకు వచ్చినప్పుడు ఆయన నుంచి 14 ఏళ్ల ప్రాయంలో ఆటోగ్రాఫ్‌ పొందారు. ప్రముఖ నాయకులు అంబేద్కర్‌, నెహ్రూ, రాజాజీలను ఇంటర్వ్యూ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయవాదులు, ప్రముఖ వ్యక్తులు ఇలా దాదాపు 6 వేల బయోగ్రఫీలను ఆయన రాశారు. ఇలా తెలుగు సాహిత్యంలో వ్యక్తుల జీవిత చరిత్రల రచయితగా ముద్ర వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో దాదాపు 20 వేల సమావేశాల్లో వక్తగా ప్రసంగించారు. దీంతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించాడు. జాతక కథలు, జాతి నిర్మాతలు, మహానాయకులు, విప్లవ వీరులు, నా కలం నా గళం, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు తదితర పుస్తకాలు రాశారు. ప్రముఖ జాతీయ నేతల ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేశారు.

పాత్రికేయ భీష్ముడిగా ప్రసిద్ధి చెందిన కుటుంబరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌గానూ కొనసాగారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ కుటుంబరావును కళాప్రపూర్ణతో గౌరవించింది. 1969లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కమిటీలో సభ్యునిగా కేంద్రం ప్రభుత్వం తుర్లపాటిని నియమించింది. నేషనల్‌ ఫిల్మ్‌ అడ్వైజరీ కమిటీలో, సెంట్రల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యారు. సుమారు మూడు దశాబ్దాల పాటు ఏపీ ఫిల్మ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీగా విధులు నిర్వహించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

1989లో ముట్నూరి కృష్ణారావు నుంచి ఉత్తమ ఎడిటర్‌ అవార్డు పొందిన కుటుంబరావు, 1990లో ఉత్తమ జీవిత చరిత్రల రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవార్డు అందుకున్నారు. ఉపన్యాస కేసరి బిరుదు వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. 1994లో కాశీనాథుని నాగేశ్వరరావు నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. 1993లో గిన్నిస్‌ బుక్‌ అవార్డు, 1998లో అమెరికా నుంచి వరల్డ్‌ లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డు పొందారు. 2002లో పద్మశ్రీ అవార్డు పొందారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version