Gruha Jyothi : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చింది. ఇందులో గృహజ్యోతి ఒకటి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు ప్రారంభించారు. మార్చి నుంచి గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే గృహజ్యోతికి తాజాగా ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇన్నాళ్లూ 200 యూనిట్లు ఫ్రీ అంటూ ప్రచారం చేసినా.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ జరుగదు అంటున్నారు. గతేడాది వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని దాని ఆధారంగా తగ్గింపు ఇస్తారని తెలుస్తోంది. ఈమేరకు విద్యుత్ శాఖ అధికారులు మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కంజంప్షన్ పేరిట విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మార్చి 1 నుంచి అమలు..
గృహజ్యోతి పథకాన్ని మార్చి 1 నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు షరతులు వర్తించనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2022–23)లో నెలకు సగటున వాడిన విద్యుత్‌కు అదనంగా 10 శాతం విద్యుత్ మాత్రమే గృహజ్యోతి పథకం కింద సరఫరా చేయనున్నారు. 200 యూనిట్లకు లోబడి ఉంటేనే ఈ పథకం అమలు చేస్తారు. గతేడాది 960 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తేత నెలకు 80 యూనిట్లు వాడినట్లు నిర్ధారిస్తారు. దానికి అదనంగా 10 శాతం అంటే మరో 8 యూనిట్లు కలిపి ఇస్తారు. అంటే 88 యూనిట్ల వరకు ఉచితం. అంతకన్నా ఎక్కువ వినియోగించే విద్యుత్‌కు బిల్లు కట్లాల్సిందే.
200 యూనిట్లు దాటితే బిల్లు కట్టాల్సిందే..
గతేడాది 200 యూనిట్లకు మించితే మాత్రం ఈ పథకం వర్తించదు. ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లుకు సంబంధించి టారిఫ్ శ్లాబు ప్రకారం బిల్లు ఇస్తారు. పరిమితిలోపు ఉంటే జీరో బిల్లు ఇస్తారు. అంతకన్నా ఎక్కువ వాడితే శ్లాబు ప్రకారం బిల్లు చెల్లించాల్సిందే.
బకాయిలు ఉన్నా..
విద్యుత్ బిల్లుల బకాయిలు ఉన్నవారికి గృహజ్యోతి వర్తించదు. బకాయిలన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. గృహజ్యోతి అమలు చేసిన తర్వాత ఎలాంటి పెండింగ్ ఉండకూడాదు. పెండింగ్ పెడితే తర్వాతి నెలకు ఉచిత పథకం వర్తించదు. బిల్లులు చెల్లిస్తేనే పథకం పునరుద్ధరిస్తారు.
తెల్లకార్డు ఉన్నవారికే..
ఇక ఉచిత విద్యుత్ పథకం తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే వర్తిస్తుంది. రేషన్‌కార్డు, ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. లబ్ధిదారుల విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నంబర్ రేషన్‌కార్డుతో అనుసంధానమై ఉండాలి. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా పరిశీలిస్తే 34,59,585 మంది మాత్రమే రేషన్‌కార్డుతో గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వారికే సబ్సిడీ వర్తించనుంది.