లాక్ డౌన్ కారణంగా ఎదురైన నష్టాలను ఎలా పూడ్చుకోవాలా అని చూస్తున్న దేశీయ విమాన సంస్థలకు కేంద్రం తాజా ఉత్తర్వులతో మరో షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ సమయంలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో, ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులను తిరిగి ఇవ్వలేమని, దీనికి బదులుగా ప్రయాణ తేదీలను పోస్ట్ పోన్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని, ఎయిర్ లైన్స్ సంస్థలు స్పష్టం చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణాలు చేయలేకపోయిన వారికి పూర్తి స్థాయిలో టికెట్ విలువను రిఫండ్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఎటువంటి క్యాన్సిలేషన్ చార్జీలు విధించకుండా పూర్తి మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని, గరిష్ఠంగా మూడు వారాల్లో డబ్బు వెనక్కు ఇవ్వాలని పౌర విమానయాన శాఖ ఓ సర్క్యులర్ లో ఎయిర్ లైన్స్ కంపెనీలను ఆదేశించింది. అయితే, ప్రయాణికులు మే 3 వరకూ బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసిన కేంద్రం, రిఫండ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సూచించింది.
కాగా, ఎయిర్ లైన్స్ సంస్థలు విస్తారా, గో ఎయిర్ తదితరాలు, తాము రిఫండ్ ను చేయలేమని ప్రకటించిన తరువాత, సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం స్పందించింది. ఇండియాలో రెండో దశ లాక్ డౌన్ మే 3 వరకూ అమలులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా విమాన సంస్థలు రూ.66 వేల కోట్లు నష్టపోయాయని ఒక అంచనా. అదేవిధంగా ఈ రంగంలో లక్షల ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.