Viral Video: మద్యపానం అనేది మంచి అలవాటు కాదు. ఆరోగ్యాన్ని హరించే మద్యాన్ని ప్రమోట్ చేయడం మా బాధ్యత కాదు.. కాకపోతే ప్రజల్లో అవగాహన కోసం ఈ వార్త రాయక తప్పడం లేదు. వాస్తవానికి గత ప్రభుత్వం అడ్డగోలుగా వైన్ షాపులు ఏర్పాటు చేసింది. కేవలం మద్యం మీద ఆదాయంతో చాలావరకు ఖర్చులను నెట్టుకొచ్చింది. 2014లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 2023 డిసెంబర్ వరకు ప్రతి ఏడాది లిక్కర్ ఆదాయం పెరిగిందే తప్ప తగ్గలేదు. పైగా వచ్చే రెండు సంవత్సరాలకు కూడా ముందుగానే అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి, వైన్ షాపులు(Wine Shops) కేటాయించింది. ఇక మద్యం విచ్చలవిడిగా అమ్మేందుకు బెల్ట్ షాపులను కూడా ప్రోత్సహించింది. ఇలాంటి వాటిని అడ్డుకోవాలిసిన ఎక్సైజ్ శాఖ ను.. మందు విక్రయాలు మరింత జరిగేలా ప్రభుత్వం ప్రోత్సహించడం విశేషం. అయితే ఇలా గుడి, బడి తేడా లేకుండా వైన్ షాపులు ఏర్పాటైన నేపథ్యంలో.. వాటికి అనుబంధంగా బెల్ట్ షాపులు కొనసాగుతున్న తరుణంలో.. అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ప్రకటించారు.
అధికారంలోకి రాగానే.. అంతకుముందు చెప్పినట్టుగానే బెల్ట్ షాపులు ఎత్తేయించారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బెల్ట్ షాపులు ఎత్తివేయడంతో మద్యం నేరుగా రోడ్డుమీదికి వచ్చింది. గతంలో చాటుమాటు వ్యవహారం లాగా సాగిన ఈ వ్యాపారం.. ఇప్పుడు ఏకంగా కూరగాయల బేరాన్ని తలపిస్తోంది. ఇందుకు ప్రబల నిదర్శనంగా వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గా సమీపంలో దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పక్కన కొందరు మహిళలు సంతలో కూరగాయల అమ్మినట్టు క్వార్టర్ బాటిల్స్ అమ్మకాలు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. వాస్తవానికి ఈ ప్రాంతంలో గతంలో బెల్ట్ షాపులు ఉండేవి. వాటిల్లో కూడా మద్యం 24 గంటల పాటు అమ్మేవారు. ఆ బెల్ట్ షాపులు ఎత్తివేయడంతో ఇలా మహిళలు నేరుగా రోడ్డుమీద మద్యం అమ్ముతున్నారు.
బెల్టు షాపులు వద్దు.. డైరెక్ట్ రోడ్డు మీదనే మద్యం అమ్మండి!
రోడ్డు మీదే తాగండి.. తాగి ఊగండి..
ఓ పక్క బెల్టు దుకాణాలు రద్దు చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం.. సంతలో సరుకులు, పశువులు అమ్మినట్లు మద్యం అమ్మకాలు. రోడ్డు పక్కనే సంచుల్లో అట్టా పెట్టెలో పెట్టుకొని మద్యం విక్రయాలు.… pic.twitter.com/PRbuGqZa0i
— Telugu Scribe (@TeluguScribe) March 3, 2024
స్థానికంగా ఉన్న వైన్ షాపుల్లో మద్యాన్ని కొనుగోలు చేసి ఇలా రోడ్డు పక్కనే అమ్ముతున్నామని మహిళలు చెబుతున్నారు. “గతంలో మేము బెల్ట్ షాపులను నిర్వహించే వాళ్ళం. అలా మాకు ఆదాయం వచ్చేది. ప్రభుత్వం బెల్ట్ షాపులు రద్దు చేయడంతో మాకు ఆదాయం పడిపోయింది.. వేరే ఏం పని చేయాలో తెలియక మళ్లీ ఇలా మద్యాన్ని అమ్ముతున్నామని” ఆ మహిళలు చెబుతున్నారు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే అని.. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి ఓటు వేస్తే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని.. కామెంట్లు చేస్తున్నారు.