YCP Dissident MLAs: ఆ పార్టీ అన్ని సీట్లను గెలుస్తామని చెబుతోంది. కానీ ఉపఎన్నికలంటే భయపడుతోంది. ఎమ్మెల్యేల పై చర్యలకు వెనకడుగు వేస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించినా .. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. వేటు వేయాలంటే వణికిపోతోంది. ఉపఎన్నికలంటే భయమా ? లేదా ఎమ్మెల్యేల ఆరోపణలు నిజమా ?. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.

వైసీపీకి అసమ్మతి కొత్తకాదు. గతంలో ఎంపీ రఘురామరాజు కూడా వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిరోజు పనిగట్టుకుని ప్రభుత్వం పై విమర్శలు చేసేవారు. ఎన్నికల హామీలు నెరవేర్చాంటూ నిలదీసేవారు. రఘురామ వైఖరితో విసిగిపోయిన వైసీపీ అధిష్ఠానం ఆయన పై సామదానభేదడండోపాయాలను ప్రదర్శించింది. అనర్హత వేటు వేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని ఆలోచించింది. కానీ రఘురామ పుణ్యమో.. వైసీపీ పాపమో జగన్ అనుకున్నది జరగలేదు. రఘురామ పై అనర్హత వేటు వేయించలేకపోయారు. దీంతో రఘురామకృష్ణరాజు ఇప్పటికీ చెవిలో జోరీగలా వైసీపీ అధిష్ఠానం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక చేసేదేంలేక వైసీపీ అధిష్ఠానం గమ్మునుండిపోయింది.
రఘురామ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ వైసీపీ పై విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకోవడానికి బయపడుతోంది. గతంలో రఘురామ విషయంలో ప్రయత్నించిన విధంగా కోటంరెడ్డి, ఆనం పై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తోంది. కోటంరెడ్డి నిన్నా.. మొన్న ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు. కానీ ఆనం రెండేళ్ల నుంచి పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. వైసీపీ అధిష్ఠానానికి కూడా ఆనం విషయంలో స్పష్టత ఉంది. కానీ ఆనం పై చర్యలు తీసుకోవడానికి భయపడింది. ఆనంకు వ్యతిరేకంగా వెంకటగిరిలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని రంగంలోకి దింపింది.

రఘురామ విషయంలో అనర్హత వేటు వేయించడానికి వైసీపీ శతవిధాల ప్రయత్నించింది. కానీ సఫలం కాలేదు. ఎందుకంటే అది కేంద్రం చేతిలో ఉంటుంది. కానీ వైసీపీ తిరుబాటు ఎమ్మెల్యేల పై వేటు వేయాలంటే జగన్ కు చిటికలో పని. వైసీపీ చేతిలోనే అధికారం ఉంది. కానీ వైసీపీ అంత ధైర్యం చేసే పరిస్థితి లేదు. ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయి. ఉపఎన్నికల్లో ఫలితం తేడా కొడితే.. సాధారణ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందో జగన్ కు తెలుసు. అందుకే ఉపఎన్నికలకు వెళ్లే ఆలోచన చేయడం లేదు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వానికి ఇంకా పదిహేను నెలల సమయం ఉంది. అనర్హత వేటు వేస్తే ఐదారు నెలల్లో ఉపఎన్నికలు జరుగుతాయి. కానీ వైసీపీ అధిష్ఠానం మాత్రం ఎన్నికలకు వెళ్లే సూచన కనపడటంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కానీ వాటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే వైఖరితో వెళ్తోంది. అలాంటిటప్పుడు అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలకు వెళ్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇప్పటికే పలు నివేదికలు జగన్ వద్ద ఉన్నాయి. ప్రజల్లో ప్రభుత్వం పై ఎలాంటి అభిప్రాయం ఉందో జగన్ స్పష్టత ఉంది. ఇప్పుడు ఉపఎన్నికల్లో జరగరానిది జరిగితే మొత్తం తేడా కొడుతుందన్న అభిప్రాయం జగన్ కు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికిప్పుడు జగన్ ఉపఎన్నికల ఆలోచన చేసే పరిస్థితి లేదు.