India: ఇది ఒకప్పటి భారత్ కాదు.. ఏకంగా ఇంట్లోకి దూరి లేపేస్తోంది..

మనదేశంపైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసిగొలిపింది కచ్చితంగా పాకిస్తాన్ దేశమే. మన దేశంలో విధ్వంసాలు సృష్టించడం, అశాంతి నెలకొల్పడం, ఆర్థికంగా పతనం చేయడమే పాకిస్తాన్ తన విధానంగా ఇన్ని సంవత్సరాల పాటు అమలు చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 13, 2024 9:13 am

India

Follow us on

India: కాలుకు కాలు.. చెయ్యికి చెయ్యి.. మెడకు మెడ.. ప్రాణానికి ప్రాణం.. ఈ సూత్రాన్ని అవలంబిస్తోంది కాబట్టే భారత ఆర్మీ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని సమూలంగా అణచివేస్తోంది. సరిహద్దుల్లో చొరబాట్లను సమర్థవంతంగా అడ్డుకుంటున్నది. ఉరి, పఠాన్ కోట్, పుల్వామా వంటి దాడుల తర్వాత అనేక పాఠాలు నేర్చుకొని.. సరిహద్దుల్లో పటిష్టంగా పహారా కాస్తోంది. ఇంటి దొంగలను జైల్లో పెడుతూనే.. బయటి దొంగల పని పడుతోంది. సీమాంతర ఉగ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన భారత్.. భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. దానిని రూపుమాపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

మనదేశంపైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసిగొలిపింది కచ్చితంగా పాకిస్తాన్ దేశమే. మన దేశంలో విధ్వంసాలు సృష్టించడం, అశాంతి నెలకొల్పడం, ఆర్థికంగా పతనం చేయడమే పాకిస్తాన్ తన విధానంగా ఇన్ని సంవత్సరాల పాటు అమలు చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీలు సెక్యులరిజం పేరుతో ఉగ్రవాదులపై పెద్దగా చర్యలు తీసుకునేవి కావు. పైగా మన దేశం పార్లమెంట్ పై దాడిని.. ముంబై మరణ హోమాన్ని చవిచూసింది. అప్పట్లో ఆ దాడిలో ప్రాణాలతో చిక్కిన కసబ్ కారణంగా పాకిస్థాన్ పన్నాగం బయటి ప్రపంచానికి తెలిసింది..

ఉగ్రవాదం వల్ల మనుషుల ప్రాణాలు మాత్రమే కాదు.. దేశ ఆర్థిక పురోగతికే పెనుముప్పు వాటిల్లింది. అయితే ఇదంతా ఒకప్పటి చరిత్ర.. ఇప్పుడు దేశ భద్రత దళాల కళ్ళుగప్పి.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులు.. పాకిస్తాన్ ఆదేశాలతో దేశంలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించే సంస్థలు.. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అంతేకాదు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల ఆగ్రనేతలు అనూహ్యంగా కన్నుమూస్తున్నారు. పాకిస్తాన్ దేశంలో ఉంటూ భారతదేశంలో విధ్వంసాలకు పధక రచన చేస్తున్న అనేకమంది ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు అర్ధాంతరంగా హత్యలకు గురవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరుపుతుంటే.. ఆ కాల్పుల్లో వారు మరణిస్తున్నారు. ఇక ఆ కాల్పులకు పాల్పడుతున్నది ఎవరనేది మన దేశ ప్రజలకు మొత్తం తెలుసు..”మా దేశం మాకు ఎప్పుడూ గొప్పదే. ప్రపంచంలోనే అత్యంత భిన్నమైన వారసత్వం మా దేశం సొంతం. మా దేశంలో ఎవరైనా విధ్వంసానికి ప్రయత్నిస్తే.. వారు ఎవరైనా సరే.. ఎక్కడ ఉన్నా సరే.. ఇంట్లోకి దూరిమరీ లేపి అవతలపడేస్తాం. (ఘర్ మే ఘుస్ గే మారేంగే) వంటి మాటలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ఇటీవల తరచూ వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం మాటలు మాత్రమే కాదు.. చేతల్లోనూ ప్రధానమంత్రి చూపిస్తున్నారు. అందువల్లే పాకిస్తాన్ దేశంలో మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు మొత్తం కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆపరేషన్ల వల్ల.. భారత రహస్య ఏజెంట్ల రూపంలో ఎప్పుడు, ఎక్కడ అంతం చేస్తారోనని ఉగ్రవాద సంస్థ ల అధిపతులు భయపడుతున్నారు. ఒకప్పుడు ఎక్కడ దాడులు జరుగుతాయోనని మనదేశంలో భయాందోళనలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉగ్రవాద సంస్థల అధిపతులకు అనుభవంలోకి వస్తోంది. అయితే ఈ మార్పు పదేళ్ల కాలంలో వచ్చింది. అంతకుముందు సెక్యులరిజం పేరుతో.. ఓ వర్గం మెప్పుకోసం ఉగ్రవాదంపై అప్పటి ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపేవి కావు. పైగా దాడులు జరిగిన తర్వాత విచారణ జరిపేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ఇబ్బంది పడేవి. కానీ ఇప్పుడు కుట్రలను ముందే పసిగట్టి, ఉగ్రవాదులను ఏది పారేస్తే స్థాయికి భారత్ చేరుకుంది. అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాద దేశంగా భారత్ నిరూపించగలిగింది. ఉగ్రవాదం కోసం ఆ దేశం ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుందో ఆధారాలతో సహా వివరించింది. ప్రపంచ దేశాలు ఉమ్మడి ప్రణాళికతో ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారు. పాకిస్తాన్ దేశానికి సహాయం పేరుతో నిధులు అందించకుండా ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నారు. అందుకే అంటారు గట్టి నాయకుడు ఉంటే.. దేశం సమర్థవంతంగా ఉంటుందని.. గత 10 సంవత్సరాలలో అది కనిపిస్తూనే ఉంది..