Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణంలో అడుగడుగునా అద్భుతాలే. వెయ్యేళ్లు మన్నగలిగే రాతి కట్టడం. ఒక్క ఇనుప ముక్క కూడా వాడకుండా చేపట్టిన నిర్మాణం. నిర్మాణం అంతా భక్తులు ఇచ్చిన విరాళాలతోనే చేయడం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అద్భుతాలు రామాలయంలో దాగి ఉన్నాయి. ఇక ఈ జాబితాలో మరో అద్భుతం చేరబోతోంది. శ్రీరామ నవమి సందర్భంగా బార రాముడు సూర్య తిలకం దిద్దుకోబోతున్నాడు. ఏటా శ్రీరామ నవమి రోజున సూర్యుని కిరణాలు బాల రాముడి నుదుటన తాకేలా నిర్మాణం చేపట్టారు. ఈ ఏప్రిల్ 17న ఈ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఇక ఈ రామ నవమి ప్రత్యేకత ఏమిటంటే అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరిన తర్వాత వచ్చిన మొదటి శ్రీరామ నవమి.
సూర్య కిరణాలు ప్రసరించేలా..
గర్భగుడిలో కొలువుదీరిన రాముడి నుదుట సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామునికి సూర్య తిలక ఇప్పుడు ప్రత్యేకత సంతరించుకుంది. అయోధ్య ఆలయం నిర్మాణం తర్వాత రామ మందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగున్నాయి. 500 ఏళ్ల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామ నవమి వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు..
ఇక ఏప్రిల్ 17న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలు సూర్య కిరణాలు రాముని నుదుటిపై 75 ఎంఎం వ్యాసార్థంతో వృత్తాకార తిలకంలా 6 నిమిషాలపాటు ప్రకాశించనున్నాయి. శ్రీరామ నవమి రోజు ఆలయాన్ని సందర్శించే భక్తులు ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించే అవకాశం లభిస్తుంది. ఇక ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. రామ నవమి రోజు సూర్యుడి కిరణాలు నేరుగా రామ్‌లల్లా విగ్రహం నుదుటిమీద పడేలా ఏర్పాటు చేశారు. లెన్స్ ప్రత్యేక అద్దాల సహాయంతో ఈ వ్యవస్థను రూపొందించారు. సూర్య తిలకం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ట్రస్టు కూడా వెల్లడించింది.
శ్రీరామ నవమి రోజు మాత్రమే..
ఇక ఈ సూర్య తిలకం శ్రీరామ నవమి రోజు మాత్రమే ఆవిష్కృతం అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రక్రియ మొదలవుతుంది. సుమారు 6 నిమిషాలపాటు గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం నుదుటి మీద కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఈ టెక్నాలజీని సీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించింది. దీనికి సబంధించిన ట్రయల్ రన్ పూర్తయింది. ఈ విషయాన్ని పరిశోధకుల బృందం కూడా ధ్రువీకరించింది. మొత్తానికి పరిశోధకుల శ్రమ ఫలించింది.