Minister Gudivada Amarnath: రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని కాబోతోంది. సీఎం విశాఖ నుంచి పరిపాలన చేస్తారు. ఇవి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గదని పరోక్షంగా చెప్పారు. రాజధాని వ్యవహారం కోర్టులో ఉన్నప్పటీకీ.. ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ప్రభుత్వం వెతుకుతోందని స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి పాలన మొదలవుతుందా ? లేదా కోర్టు నుంచి అడ్డంకులు ఎదురవ్వనున్నాయా ? అన్న చర్చ ఏపీలో జరుగుతోంది.

అమరావతికి జైకొట్టిన జగన్ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారు. మూడు రాజధానులను తెర మీదకి తెచ్చారు. రాజధాని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. రాజధాని మార్చే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతి నిర్మాణాన్ని పూర్తీ చేయాలని స్పష్టం చేసింది. దీని పై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాల పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈనెల 30 మూడు రాజధానుల అంశం సుప్రీంలో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి అమర్నాథ్ కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖ నుంచి పరిపాలన మొదలవుతుందని ప్రకటన చేశారు.
సుప్రీం కోర్టులో రాజధాని అంశం విచారణలో ఉండగా .. ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెట్టే ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. కోర్టు తీర్పు వచ్చేలోపు తమకు అవకాశం ఉన్న ప్రత్యామ్నయాలను వెతకాలని యోచిస్తోంది. ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లోనే విశాఖ నుంచి పాలన మొదలు పెట్టే అంశం పై ప్రకటన చేయనుంది. మార్చి 22 నుంచి విశాఖ నుంచి పాలనకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల పై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. తీర్పు ఆలస్యం అయినా విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని జగన్ యోచిస్తాన్నారు. ప్రతిపక్షాలు మాత్రం మూడు రాజధానులు సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టం మార్చే అధికారం పార్లమెంట్ కే ఉంటుందని చెబుతున్నారు.