KCR Focus On Rayalaseema: ఏపీ పై బీఆర్ఎస్ ఫోకస్ పెరిగింది. కోనసీమ నుంచి రాయలసీమకు మళ్లింది. సీమ నేతలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సీమ సమస్యలను ఫోకస్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ నుంచి రాయలసీమకు పిలుపొచ్చింది. సీమ నేతలకు బీఆర్ఎస్ నుంచి ఆహ్వానమొచ్చింది.

ఏపీలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకుపోతోంది. కోనసీమలో కాపు ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పుడు రాయలసీమ పై ఫోకస్ పెట్టింది. సీమ కోసం పోరాడుతున్న ఉద్యమకారులకు ఆహ్వానం పంపింది. బీఆర్ఎస్ అధ్యక్షుడితో సీమ ఉద్యమకారులు భేటీ అవ్వనున్నారు. రాయలసీమ సమస్యలే ప్రధాన అజెండాగా సమావేశం జరిగే అవకాశం ఉంది. సీమలో బీఆర్ఎస్ తో కలిసి వచ్చే వారిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు.
దశాబ్దాలుగా తెలంగాణ తరహాలో రాయలసీమ వెనుకబాటుకు గురైంది. స్థానిక ముఠాలు, ఫ్యాక్షన్ సంస్కృతి రాయలసీమకు శాపంగా మారాయి. ఫలితంగా నీటి వాటాలు, అభివృద్ధిలో అన్యాయం జరిగింది. దీని పై ప్రధానంగా కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ తరహాలో రాయలసీమ అభివృద్ధికి ఉద్యమిస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీ, వైసీపీతో చాలా మంది రాయలసీమ ఉద్యమకారలు దూరంగా ఉంటున్నారు. ఆయా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడ ఒకమాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాయి. సీమ సమస్యల గురించి రెండు పార్టీలు చిత్తశుద్ధితో పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో సీమ ఉద్యమకారులు ప్రత్యామ్నాయ వేదిక కోసం వేచిచూస్తున్నారు.

కేసీఆర్, సీమ నేతల మధ్య సమావేశంలో కీలక విషయాలు చర్చకు వస్తాయి. సీమ నేతలకు కేసీఆర్ భరోసా ఇవ్వగలిగితే బీఆర్ఎస్ కు మద్దతు లభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కొంత మేర ఓటు బ్యాంకును సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రాయలసీమ సమస్యల పై గళమెత్తిన రాజకీయ నాయకులు చాలా అరుదనే చెప్పాలి. కాబట్టి కేసీఆర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే బీఆర్ఎస్ కు పాజిటివ్ గా మారనుంది.