Gorakhpur News: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటుంటారు. అయితే నేటి కాలంలో అలా జరగడం లేదు. ముఖ్యంగా యువకులకు సకాలంలో వివాహాలు జరగడం లేదు. దీంతో చాలామంది వివాహాలు చేసుకోకుండానే బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. బ్రహ్మచారులుగా మిగిలిపోయిన వారిని మన సమాజం రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటుంది. ఇంకా పెళ్లి కాలేదా? ఏదైనా లోపం ఉందా? పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తూ ఉంటుంది.
ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొని ఇబ్బంది పడే దానికంటే.. పెళ్లి చేసుకొని ఆ ఇబ్బందులేవో పడితే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. ఇష్టాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో అన్ని సామాజిక వర్గాలలో యువకులకు వివాహాలు జరగడం లేదు. అమ్మాయిలకు రిక్వైర్మెంట్లు పెరగడంతో అనుకున్నంత ఈజీగా అబ్బాయిలకు వివాహాలు జరగడం లేదు. దీంతో చాలామంది బ్రహ్మచారులు గానే మిగిలిపోతున్నారు. ఇలా బ్రహ్మచారిగా మిగిలిపోవడం ఇష్టం లేక.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 45 సంవత్సరాల ఇంద్ర కుమార్.. రకరకాల ప్రయత్నాలు చేశాడు. తనకు అంత వయసు వచ్చినప్పటికీ పెళ్లి కాకపోవడంతో మధ్యవర్తులను కలిశాడు. తనకు 18 ఎకరాల పొలం ఉందని ఓ వీడియో రిలీజ్ చేశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇంద్ర కుమార్ చేసిన పోస్ట్ చూసిన సాహిబా అనే యువతీ రంగంలోకి దిగింది. ఇంద్ర కుమార్ ను లైన్లో పెట్టింది. ప్రేమ పేరుతో దగ్గర అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికింది. దీంతో ఒంటరి జీవితం మీద వేసారిపోయిన ఇంద్ర కుమార్ సాహిబా చెప్పినట్టుగా చేశాడు. సాహిబాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ ప్రాంతం. తనను పెళ్లి చేసుకుంటానని సాహిబా చెప్పడంతో ఇంద్ర కుమార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో అతడు సాహిబా చెప్పినట్టుగానే గోరఖ్పూర్ ప్రాంతానికి వెళ్ళాడు. సాహిబా ముందుగానే షరతులు విధించడంతో.. తన బంధువుల్ని ఎవరిని కూడా ఇంద్రకుమార్ అక్కడికి తీసుకెళ్లలేదు. కొంతమందితో మాత్రమే అక్కడికి వెళ్ళాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సాహిబా ఇంద్ర కుమార్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనితో సంతకాలు పెట్టించుకుంది. అనంతరం కొద్దిరోజులపాటు ఇంద్ర కుమార్ అక్కడే ఉన్నాడు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు.. ఇంద్ర కుమార్ మృతదేహం స్థానికంగా ఉన్న పొదల్లో దొరికింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. వివరాలు సేకరించి.. సాహిబాను అరెస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. భార్యలు భర్తలను చంపడం పరిపాటిగా మారుతున్నది. ఈ పరంపర ఇలా కొనసాగుతుండగానే గోరఖ్పూర్ ఘటన వెలుగులోకి రావడంతో మరో సంచలనం నమోదయింది. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.. అయితే ఇంద్ర కుమార్ ఆస్తి మీద కన్నేసిన సాహిబా.. అతనితో సంతకాలు పెట్టించుకున్న తర్వాత.. కొద్దిరోజులు మంచిగా ఉన్నట్టు నటించింది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి అతడిని అంతం చేసినట్టు తెలుస్తోంది. సాహిబా కుటుంబ సభ్యులు ఇంద్ర కుమార్ ను అత్యంత దారుణంగా హతమార్చినట్టు తెలుస్తోంది.. పైగా అతనిని చంపి ముళ్ళపొదల్లో వేసినట్టు సమాచారం. ఇంద్ర కుమార్ ఆస్తిని కొట్టేయడానికి సాహిబా పెళ్లి నాటకం ఆడినట్టు తెలుస్తోంది.
అయితే పోలీసులు ఇప్పటికే సాహిబాను అరెస్ట్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరింతగా లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. సాహిబాకు సహకరించిన వారెవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ కేసులో మరింతమంది పాత్ర ఉన్నట్టు అవగతం అవుతున్నది. అతడిని హతమార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు.