రోజు 8 గంటలు పని అని చెప్పి ఉద్యోగంలో చేరాక 12 గంటల పాటు చావకొట్టే సంస్థలు ఎన్నో ఉన్నాయి. కొన్ని అయితే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనులు చేయిస్తూనే ఉంటాయి. సాఫ్ట్ వేర్ సంస్థల్లో పనులు పూర్తయ్యేదాకా పాపం టెకీలను మేనేజర్లు, సంస్థ ఎండీలు వేధిస్తూనే ఉంటారు.
కానీ గూగుల్ మాత్రం ఈ కరోనా కల్లోలం వేళ ఉద్యోగులకు తీపికబురును అందించింది. గూగుల్ సహా అనేక సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా తమ ఉద్యోగులకు తాజాగా సరికొత్తగా ఉద్యోగం చేసుకునే సౌకర్యాన్ని ఇచ్చింది.
గూగుల్ లో పనిచేసే ఉద్యోగులు ఇక మూడు రోజుల పాటు ఆఫీస్ కు రావాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రోజులు ఉద్యోగుల ఇష్టం.. వారికి ఎక్కడ పనిచేయాల్సిన సౌకర్యం ఉంటుందో అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇలా ఉద్యోగులకు ఫ్రీడం ఇచ్చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. వారంలో మూడు రోజులు మాత్రమే ఆఫీసుకొచ్చి చేయండని ఉద్యోగులకు సుందర్ పిలుపునిచ్చాడు. మొత్తం ఉద్యోగుల్లో 20శాతం మంది మాత్రమే వర్క్ ఫ్రం హోం చేస్తారని.. 60శాతం మంది మాత్రమే వారంలో మూడు రోజులు మాత్రమే ఆఫీసుకొచ్చేలా ప్రణాళిక తయారు చేశాడు.
ఇప్పటికే వర్క్ ఫ్రం హోంతో పనిగంటలు బీభత్సంగా పెరిగిపోయి ఉద్యోగులు నానా యాతన పడుతున్నారు. ఇంట్లో పెళ్లాంపిల్లలతో అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ తన ఉద్యోగులకు ఇలా స్వేచ్ఛనిచ్చిన తీరుపై ఆ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.