OYO
OYO : ప్రస్తుతం ఓయో అంటే తెలియని వారుండరు. హోటల్స్ బిజినెస్ లో అనతి కాలంలోనే భారీ ఆదరణ సంపాదించుకుంది. ప్రస్తుతం దేశంలోని ప్రతి చిన్న పట్టణంలో ఓయో హోటల్స్ ఉన్నాయి. ఓయో గ్రూప్ తన ఆర్థిక పనితీరు ద్వారా మరోసారి మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో ఈ గ్లోబల్ హాస్పిటాలిటీ సంస్థ రూ.166 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.25 కోట్లు మాత్రమే ఉండగా, ఈసారి ఆరు రెట్లు అధికంగా లాభాలు నమోదు కావడం గమనార్హం.
గణాంకాల్లో వృద్ధి
ఈ త్రైమాసికంలో OYO రూ.1,695 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.1,296 కోట్లు ఉండగా, ఈసారి 31శాతం పెరుగుదల నమోదైంది. కంపెనీ నిర్వహణ లాభం (EBITDA) రూ.249 కోట్లు కాగా, గత సంవత్సరం ఇది రూ.205 కోట్లు మాత్రమే. అంటే 22% వృద్ధి సాధించింది. OYO గ్లోబల్ స్థాయిలో రూ.3,341 కోట్ల స్థూల బుకింగ్ విలువను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,510 కోట్లు మాత్రమే ఉండగా, ఈసారి 33% వృద్ధి కనిపించింది.
గత ఏడాదితో పోలిస్తే విపరీతమైన మార్పులు
2025 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఓయో రూ.457 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇదే కాలంలో గత ఏడాది రూ.111 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంటే OYO తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుని లాభదాయకంగా మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. లాభాల ఆర్జించడానికి కంపెనీ కొన్ని వ్యూహాలను అమలు చేసింది. భారతదేశం, అమెరికా వంటి ప్రధాన మార్కెట్లలో మెరుగైన పనితీరును కనబరిచింది. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. భారతదేశంలో ప్రీమియం హోటల్ సేవలు అందించడం మొదలు పెట్టింది. అమెరికా హోటల్ కంపెనీ G6 హాస్పిటాలిటీ, పారిస్‌కు చెందిన చెక్‌మైగెస్ట్ ఇంటి అద్దె సంస్థను కొనుగోలు చేసింది.
గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనాలు
ఓయో ఆర్థిక స్థిరత్వాన్ని గమనించిన మూడీస్, కంపెనీ రేటింగ్‌ను B3 నుండి B2కి పెంచింది. ఇది కంపెనీ మెరుగైన ప్రదర్శనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. FY25-26 నాటికి OYO EBITDA $200 మిలియన్లకు చేరుకుంటుందని మూడీస్ అంచనా వేసింది. గతంలో నష్టాల్లో కొనసాగిన OYO, 2025 నాటికి లాభదాయకంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో రెవెన్యూ పెరుగుదల కొనసాగుతుందా? అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో OYO తన వ్యాపార వ్యూహాలతో మంచి ఫలితాలు సాధిస్తోందనే చెప్పాలి.