కాంగ్రెస్సా.. ఊపిరి పీల్చుకో!

ఇది 1991 నాటి విష‌యం. తీవ్ర‌వాద దాడిలో రాజీవ్ గాంధీ మ‌రణించారు. అప్ప‌టి వ‌ర‌కూ తిరుగులేని శ‌క్తిగా కొన‌సాగిన కాంగ్రెస్ ఓడ‌కు ఉన్న‌ట్టుండి నాయ‌కుడు.. నావికుడు క‌రువ‌య్యాడు. ఇప్పుడేం చేయాలి? అని కాంగ్రెస్ పార్టీ మొత్తం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. పార్టీలో సీనియ‌ర్లు లేరా? కావాల్సినంత మంది ఉన్నారు. కానీ.. వారిని దేశం ఎంత మేర విశ్వ‌సిస్తుంద‌న్న‌దే సందేహం. సందేహమే కాదు.. ఖ‌చ్చిత‌మే. మునుప‌టి అధినేత‌ల్లా వేరేవారిని ఆద‌రించ‌డం క‌ల్ల‌. రాహుల్ గాంధీ అప్ప‌టికి 20ఏళ్ల కుర్రాడు. దీంతో.. […]

Written By: Bhaskar, Updated On : May 1, 2021 9:46 am
Follow us on

ఇది 1991 నాటి విష‌యం. తీవ్ర‌వాద దాడిలో రాజీవ్ గాంధీ మ‌రణించారు. అప్ప‌టి వ‌ర‌కూ తిరుగులేని శ‌క్తిగా కొన‌సాగిన కాంగ్రెస్ ఓడ‌కు ఉన్న‌ట్టుండి నాయ‌కుడు.. నావికుడు క‌రువ‌య్యాడు. ఇప్పుడేం చేయాలి? అని కాంగ్రెస్ పార్టీ మొత్తం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. పార్టీలో సీనియ‌ర్లు లేరా? కావాల్సినంత మంది ఉన్నారు. కానీ.. వారిని దేశం ఎంత మేర విశ్వ‌సిస్తుంద‌న్న‌దే సందేహం. సందేహమే కాదు.. ఖ‌చ్చిత‌మే. మునుప‌టి అధినేత‌ల్లా వేరేవారిని ఆద‌రించ‌డం క‌ల్ల‌. రాహుల్ గాంధీ అప్ప‌టికి 20ఏళ్ల కుర్రాడు. దీంతో.. కాంగ్రెస్ మొత్తం సోనియాగాంధీ వైపు చూసింది.

ఇట‌లీకి చెందిన ఆమెకు రాజ‌కీయాల‌తో ఎలాంటి సంబంధమూ లేదు. అందుకే.. ఆమె నిరాక‌రించారు. కాలం గ‌డుస్తోంది. ప‌రిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ల ప్ర‌ద‌క్షిణ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అలాంటి అనివార్య ప‌రిస్థితుల్లో 1997లో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. 1998లో కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఎన్నిక‌య్యారు. ఆ విధంగా మొద‌లైన ఆమె రాజ‌కీయ ప్ర‌స్థానం.. ప్ర‌త్య‌ర్థుల‌ను ధీటుగా ఎదుర్కొంటూ సాగింది. అతి త్వ‌ర‌గా భార‌త రాజ‌కీయాల‌ను ఒంట‌బ‌ట్టించుకున్న సోనియా.. అనిత‌ర‌సాధ్య‌మైన ప్ర‌గ‌తిని సాధించారు. దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు ఉత్థానంలో కొన‌సాగారు.

ఆ త‌ర్వాత వ‌య‌సు మీద ప‌డ‌డం.. అనారోగ్యం వేధించ‌డం వంటి కార‌ణాల‌తో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. 2019లో తీవ్ర అనారోగ్యం బారిన ప‌డిన సోనియా.. విదేశాల‌కు వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారు. ఈ కార‌ణంగానే అదే ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కూడా చేయ‌లేదు. ఆ త‌ర్వాత జ‌రిగిన మిగ‌తా ఎన్నిక‌ల్లో కూడా! ఇక‌.. సోనియా గాంధీ రాజ‌కీయాల నుంచి రిటైర్ అయిన‌ట్టేనా? అని కాంగ్రెస్ శ్రేణులు నిట్టూర్చాయి.

ఇటు చూస్తే.. మోడీ హ‌వా ముందు రాహుల్ తేలిపోతున్నాడు. చివ‌ర‌కు అధ్య‌క్ష ప‌ద‌విని వ‌దిలేసి.. అస్త్ర స‌న్యాసం కూడా చేసేశాడు. ఆ త‌ర్వాత మ‌రోసారి రాహుల్ ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. ఆ పార్టీలోని ముసలి బ్యాచ్.. జీ24 అంటూ సంఘం పెట్టుకొని ప్రతీ కీలక ఎన్నికల వేళ కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. హ‌స్తం గూటిలో ఉంటూ.. ప్ర‌త్య‌ర్థుల‌కోసం ప‌నిచేస్తున్నారా? అనే సందేహాలు కూడా వ‌చ్చాయి. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. దీంతో.. ఇండియ‌న్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ ఓడ మ‌రో టైటానిక్ కానుందా? అనే ఆందోళ‌న వ్య‌క్తం చేసిన వారు కూడా లేక‌పోలేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకునే వార్త ఒక‌టి ఉప్పందుతోంది. సోనియా గాంధీ తిరిగి వ‌చ్చింద‌న్న‌దే ఆ వార్త సారాంశం. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సోనియా.. మ‌ళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 74 సంవ‌త్స‌రాలు. రాజ‌కీయాల ప‌రంగా చూసుకున్న‌ప్పుడు ఇంకా ప‌దేళ్ల పైనే ఆమె క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. యువ‌రాజుగా ఉన్న కొడుకును మ‌హారాజును చేయ‌డ‌మే ఆమె అంతిమ ల‌క్ష్యం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో మూడేళ్ల స‌మ‌యం ఉంది. దీంతో.. ఇప్ప‌టి నుంచే గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ చేసి, ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నార‌నే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే.. కాంగ్రెస్ పార్టీకి అంత‌క‌న్నా సంతోషం క‌లిగించే విష‌యం మ‌రేం ఉంటుంది?