కరోనా టైంలో కరోనాను పట్టించుకోకుండా.. సీఎం కేఈఆర్ ఇతర వాటిపైనే దృష్టి పెట్టారని ఓ వైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త సెక్రటేరియట్, నిర్బంధ సాగు తదితర ప్రణాళికలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ అంతా ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం మీదనే పెట్టినట్లుగా తెలుస్తోంది. సోమవారం నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎలాగైన దీనిని పాస్ ఆన్ చేయాలనే ఉత్సుకతతో ఉన్నట్లు సమాచారం. అయితే. రాష్ట్రంలో రెవెన్యూ శాఖలోని అవినీతి పీడను అంతం చేసేందుకు ఈ కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేశారు.
Also Read: రేపటి నుంచి అసెంబ్లీ: టీఆర్ఎస్ vs కాంగ్రెస్ ఫైటేనా?
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అల్లర్లకు పోకుండా.. ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి అయిన హరీష్‌రావు తాజాగా కరోనా బారిన పడ్డారు. ఆయనే స్వయంగా ట్వీట్ కూడా చేశారు. దీంతో ఈ కొత్త రెవెన్యూ చట్టం బిల్లును స్వయంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతారని చెబుతున్నారు. ఈ చట్టం వల్ల కలిగే ఉపయోగాలు, గతంలో రెవెన్యూ శాఖలోని లోపాల వల్ల ప్రజలు ఎలా వేధింపులకు గురయ్యారు, దోపిడీకి గురయ్యారు అన్నది అసెంబ్లీ వేదికగా వివరిస్తారని అంటున్నారు.
కొందరు ఎమ్మార్వోలు, వీఆర్‌వోల కారణంగా రాష్ట్రంలో ప్రజలు దోపిడీకి గురవుతున్నారనేది బహిరంగ రహస్యం. వారి వల్లే మొత్తం రెవెన్యూ శాఖ అవినీతిలో అగ్రగామిగా ఉంటోందని కేసీఆర్ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్వోలు, వీఆర్‌వోల ప్రమేయం తగ్గించేలా, వారి అధికారాలను కట్ చేసేలా రెవెన్యూ చట్టం ఉండబోతోంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో ఎమ్మార్వో , వీఆర్‌వోల పాత్ర లేకుండా కటింగ్ పెట్టబోతున్నారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమెటిక్‌గా భూమి కొన్న వ్యక్తి పేరు మీద మ్యుటేషన్ జరిగేలా వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఎమ్మార్వోలు, వీఆర్‌వోలు ఇతర ఉద్యోగుల తరహాలోనే సాధారణ పనులకు పరిమితం కానున్నారు.
Also Read: కరోనా కాఠిన్యం: చెదిరిపోతున్న జర్నలిస్టులు
ఈ చట్టం ద్వారా భూవివాదాలకూ పరిష్కారం చూపాలని భావిస్తున్నారట. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వాటికి సాధ్యమైనంత తొరగా పరిష్కారం చూపాలని గడువు విధించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తారట. రిటైర్డ్ జడ్జిలతో ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయించింది.