మరో రెండు మూడు నెలల్లో గ్రేటర్ ఎన్నికలకు ముహూర్తం రెడీ కాబోతోంది. ఇప్పటికే పార్టీలు తమ ప్రచారంతో వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా కరోనా తొలగిపోలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యంగా ప్రచారంపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. పోలింగ్ అధికారులతోపాటు ఓటర్లు కూడా మాస్కులు ధరించడం తప్పని సరి చేశారు. ఓటరును గుర్తించాల్సిన పరిస్థితి వస్తే మాస్కును జరిపి ముఖాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే సంబంధిత అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి మార్గదర్శకాలపై తెలంగాణ రాష్ర్ట ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది.
Also Read: యాక్టివ్ రోల్‌లోకి కొండా దంపతులు! ఏం చేస్తారు?
అలాగే.. ఇంటింటి ప్రచారంలోనూ అభ్యర్థితో సహా ఐదుగురికే పర్మిషన్ ఉంటుందని వెల్లడించింది. రోడ్ షోలకు ఐదు వాహనాలు మాత్రమే అనుమతించనున్నారు. సభలు, సమావేశాల నిర్వాహణలోనూ కరోనా కట్టడి చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌ను మరికొన్ని వర్గాలకు విస్తరించారు. రక్షణ రంగంలో పనిచేసే వారు, ఎన్నికల విధులకు హాజరయ్యే వారు, అధికారిక విధుల నిర్వహణలో భాగంగా దూరంగా ఉన్న.. విదేశాల్లో ఉన్న వారికి మాత్రమే ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వీలుంటుందని తెలిపారు. దివ్యాంగులకు, 80 ఏళ్లు పైబడిన ఓటర్లతో పాటు అత్యవసర సేవల విధుల్లో పాల్గొంటున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారి సంఖ్య భారీగా పెరగనుంది.
ఈసారి పోలింగ్ కేంద్రాల విషయంలోనూ పద్ధతి మార్చనున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా విశాలంగా ఉన్న బిల్డింగ్‌లను ఎంపిక చేయనున్నారు.పోలింగ్ కేంద్రం, ఆ పరిసరాల్లో శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని వెల్లడించారు. పోలింగ్‌కు ఒక రోజు ముందే పోలింగ్ కేంద్రాలు శానిటైజ్ చేయాలని, పురుషులు, మహిళా ఓటర్లకు వేర్వేరు క్యూ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వృద్ధులు, దివ్యాంగుల కోసం మూడో ప్రత్యేక లైన్ ఏర్పాటుతో పాటుపోలింగ్ కేంద్రాల దగ్గర మార్కింగ్ చేయాలని సూచించారు.
Also Read: అప్పుడే 6 కోట్ల ఓట్లు.. అమెరికా ఓటర్ల తీర్పు ఎటువైపు?
అభ్యర్థులు నామినేషన్‌ను కూడా ఈ ఎన్నికల్లో ఆన్‌లైన్ పద్ధతిలో వేయనున్నారు. టీఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో పూర్తిచేసి ఆ ప్రింట్ కాపీని రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అఫిడవిట్, విద్యార్హతలు, నేరచరిత్ర ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో పూర్తి చేస ప్రింట్ కాపీ అందించవచ్చని తెలిపింది. రోజు వారి ఎన్నికల వ్యయాన్ని కూడా ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలుకు అభ్యర్థి, మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేసే కార్యాలయ ఆవరణ దగ్గరకు రెండు వాహనాలనే అనుమతించనున్నారు. కరోనా కట్టడి చర్యలు, ఏర్పాట్ల పర్యవేక్షణకు జీహెచ్ఎంసీ, సర్కిల్, వార్డు స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించారు.