Germany Job to Bihar Politics: నేటి కాలంలో విద్యావంతులు రాజకీయాలలోకి చాలామంది పిలుపునిస్తుంటారు. రాజకీయాల్లో కొత్త రక్తం రావాలని కోరుతుంటారు. కానీ విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే.. ప్రజలు స్వీకరించే విధానం మరో విధంగా వుంటున్నది. దీనికి సజీవ ఉదాహరణే ఇతడి రాజకీయ ప్రయాణం.
అతని పేరు శశాంత్ శేఖర్. ఉన్నత విద్యావంతుడు. ఐఐటి ఢిల్లీ, ఐఐఎం కోల్ కతా లో చదువుకున్నాడు. జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి ఇతడి ప్యాకేజీ 1.25 కోట్లు. ఈ నేపథ్యంలో అతడు ఉన్నట్టుండి ఇండియాకు వచ్చాడు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇతడి స్వస్థలం బీహార్. ఇటీవల ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇక్కడి పాట్నా సాహిబ్ నియోజకవర్గంలో పోటీ చేశాడు. వినూత్నంగా ప్రచారం చేశాడు. అధికారంలోకి వస్తే నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని ఓటర్లకు మాటిచ్చాడు. నియోజవర్గం మొత్తం సుడిగాలి పర్యటన చేశాడు. ఓటర్లను విందు వినోదాలతో ఆనందింపజేశాడు. తనదే గెలుపని గట్టిగా ప్రచారం చేసుకున్నాడు. తన ప్రత్యర్థికి డిపాజిట్ కూడా రాదని స్పష్టం చేశాడు.
Also Read: సీఎంగా ప్రమాణ స్వీకారం కాకముందే ఎమ్మెల్యేలకు నితీష్ కుమార్ బంపర్ గిఫ్ట్.. మెజారిటీ ఉన్న ఎందుకిలా?
ఎన్నికల ప్రచారం జోరుగా చేసిన శశాంత్.. పోల్ మేనేజ్మెంట్లో దారుణంగా విఫలమయ్యాడు. చివరి మూడు రోజుల్లో అతడు చేతులెత్తేశాడు. దీంతో 38,900 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థి రత్నేష్ కుమార్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో శశాంత్ నిర్వేదంలో మునిగిపోయాడు. అయితే ఇతడి గురించి జాతీయ మీడియాలో ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. దేశంలో రాజకీయాల్లోకి రావాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలని.. ఉన్నత విద్యావంతులను ప్రజలు పెద్దగా లెక్కలోకి తీసుకోలేరని.. దానికి శశాంత్ బలమైన ఉదాహరణ అని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.
Also Read: షేక్ హసీనా పై ఇంతటి ప్రతీకారమా? మరణ శిక్ష వెనక అసలు కారణమిదే!
తాను ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటానని శశాంత్ చెబుతున్నాడు. నియోజకవర్గంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అంటున్నాడు. తన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ.. ప్రజల సమస్యలపై పోరాడే సత్తా ఉందని.. తాను విదేశాలకు పోనని.. ప్రజాక్షేత్రంలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని శశాంత్ చెబుతున్నాడు. ఏనాటికైనా ఎమ్మెల్యేని అవుతానని అతడు బలంగా చెబుతున్నాడు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరిస్తారని.. ఆ నమ్మకం తనకు ఉందని శశాంత్ చెబుతున్నాడు. నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని మరింత దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తానని అతడు వివరిస్తున్నాడు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి వెనకడుగు వేసేది లేదని అతడు స్పష్టం చేస్తున్నాడు.