Ganta Srinivasa Rao: ఆయనెప్పుడూ అధికార పక్షమే. ఆయన చేరిన పార్టీ అధికారంలోకి వస్తుంది. లేకుంటే అధికారంలో ఉండే పార్టీలో ఆయన చేరిపోతారన్న అపవాదు నడిచింది. అయితే గడిచిన మూడేళ్లలో అటువంటి పరిణామాలేవీ జరగలేదు. అలాగని సొంత పార్టీలోనూ ఉండలేదు. అటువంటి వ్యక్తి ఇటీవల ఉన్నపలంగా యాక్టివ్ అయ్యారు. పార్టీ అధినేత వద్ద తెగ హంగామా చేస్తున్నారు. ఆయనే సాగర నగరం నేత గంటా శ్రీనివాసరావు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు.
ఆయన అయితే గెలిచారు కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. తొలుత అధికార పార్టీలోకి గోడ దూకేస్తారన్న ప్రచారం సాగింది. బీజేపీలో చేరిపోతారన్న వార్తలు పుకార్లు, షికార్లు చేశాయి. కానీ అవేవీ జరగలేదు. అలాగని పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పనిలో పనిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా టీడీపీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవిని సైతం రాజీనామా చేశారు. కానీ ఇంతవరకూ రాజీనామా ఆమోదానికి నోచుకోలేదు. అయితే కాలం గడుస్తోంది. మూడేళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో గంటా మనసు మార్చుకున్నట్టు ఉన్నారు.
Also Read: Revanth Reddy: రాహుల్ గాంధీ కోసం రేవంత్ తొక్కని గడపలేదు! అడగని వారులేరు!
ఇన్నాళ్లూ అధికార పార్టీకి భయపడిన ఆయన బయటకు వస్తున్నారు. పనిలో పనిగా పార్టీ వేదికలపై కనిపిస్తున్నారు. పార్టీ కండువాలు కప్పుకొని మరీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు లంఘించుకుంటున్నారు. అయితే గంటా వ్యవహార శైలిని చూసిన తెలుగు తమ్ముళ్లు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. మూడేళ్లలో టీడీపీ కార్యాలయం, కార్యక్రమాలను ముఖం చాటేసిన గంటాలో ఈ మార్పు ఏమిటని తెగ చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనకు రెండు రోజుల కిందట విచ్చేసిన చంద్రబాబుకు విశాఖ ఎయిర్ పోర్టులో గంటా స్వాగతం పలికినప్పుడు తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు, పోనిలే గంటా ఎలాగోలా దారికొచ్చారని సంబర పడ్డారు. కానీ తరువాత రోజు టీడీపీ శ్రేణుల సమావేశానికి హాజరుకాకపోవడంతో ఖంగుతిన్నారు. గంటా ఇదేంటి తీరు అంటూ మండిపడ్డారు.
మూడేళ్లుగా సైలెంట్
2019 ఎన్నికల తరువాత గంటా శ్రీనివాసరావు సైలెంట్ కావడం వెనుక పెద్ద కథే నడిచింది. అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆయన తెగ ప్రయత్నించారని టాక్ నడిచింది. కానీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు అడ్డుకున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వ మూడేళ్ల పాలన ముగిసింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండడంతో గంటా మళ్లీ పార్టీలో యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పార్టీ అంటేనే ముట్టనట్టుగా ఉన్న గంటా ఒక్కసారిగా రూటు మార్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేయాలలని భావిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో గంటాను మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విభేదించేవారు. వీరికి అసలు పొసిగేది కాదు. గంటా వైఖరిని బహిరంగంగానే అయ్యన్నపాత్రుడు తప్పుపట్టేవారు. తరచూ పార్టీలు మార్చే వారంటూ వ్యాఖ్యానాలు చేసేవారు. అటువంటి అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లాలోకి వెళ్లిపోవడంతో గంటా శ్రీనివాసరావు విశాఖ సాగర నగరానికి సోలో మహారాజు కావచ్చని భావిస్తున్నారట. అందుకే ప్రస్తుతానికి టీడీపీ సేఫ్ జోన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
పునరాలోచనలో..
విశాఖను పాలనా రాజధానిగా జగన్ ప్రకటించినా నగర ప్రజల్లో మాత్రం ఎటువంటి హర్షాతిరేకాలు వ్యక్తం కాలేదు. నగర పాలక సంస్థ ఎన్నికల్లో సైతం అధికార వైసీపీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదు. నగరంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పట్టుసడల్లేదు. ఇవన్నీ గంటాను నైరాశ్యంలోకి మార్చాయి. అందుకే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో పనికానిచ్చేద్దమంటూ నిర్ణయించుకున్నారు. అయితే కరుడుగట్టిన టీడీపీ నాయకులు, అభిమానులు మాత్రం గంటా వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఐదేళ్ల కాలం మంత్రి పదవి అనుభవించారు. తీరా అధికారం కోల్పోయేసరికి ముఖం చాటేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటా వైఖరిపై బహిరంగంగానే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గంటా మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తనకు రాజకీయ మైలేజ్ ఇచ్చే పార్టీలోనే కొనసాగాలని భావిస్తున్నారు.
Also Read:Revanth Rahul vs KCR : టీఆర్ఎస్ సర్కార్ కంబంధ హస్తాల్లో ‘ఓయూ’.. కేసీఆర్ దెబ్బకు రేవంత్ ఫెయిల్?