వారంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి మిత్రులు.. ఆయన కేబినెట్ లో మంత్రులు కూడా.. కానీ, జగన్ కు మాత్రం శత్రువులు అయ్యారు! తండ్రిని మహానేత అని పొగుడుతున్నవారే.. కొడుకును మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకీ.. ఎవరు వారు? జగన్ ను ఎందుకు శత్రువుల జాబితాలో చేర్చారు?
Also Read: రజనీ పార్టీ చిహ్నం ఇదే..?ప్రజలను ఆకట్టుకోనుందా..?
లిస్టులో కాంగ్రెస్ సీనియర్లు..
జగన్ ను టార్గెట్ చేస్తున్న వారిలో వైఎస్ ఆత్మ కేవీపీ తోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారు. నిన్నటి దాకా పీసీసీ చీఫ్ గా పనిచేసిన రఘువీరారెడ్డి జగన్ మీదనే విమర్శలు ఎక్కువగా చేసేవారు. నాడు జగన్ విపక్షంలో ఉన్నా కూడా రఘువీరా అసలు విడిచిపెట్టేవారు కారు. జగన్ కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచారు అనేవారు. వైఎస్ మంత్రివర్గ సహచరుడు, పీసీసీ చీఫ్ సాకె శైలజానాథ్.. దేశంలో అత్యంత బలహీనమైన సీఎం జగన్ మాత్రమేనని తేల్చేశారు. మోడీని చూసి జగన్ భయపడుతున్నారని, ఆయన ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని అంటున్నారు. రైతుల గొంతు కోసే వ్యవసాయ బిల్లులకు బేషరతుగా మద్దతు ఇచ్చిన జగన్.. తండ్రి ఆశయాలను తుంగలోకి తొక్కేశారని విమర్శించారు శైలజానాథ్.
ఉండవల్లి సైతం …
ఇక, వైఎస్సార్ ప్రాపకంతో రాజకీయంగా ఎదిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు ఆ మధ్య వరకూ జగన్ ని సపోర్ట్ చేసినా.. తాజాగా ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. వైఎస్సార్ వేరు జగన్ వేరు అంటూ మీడియా ముఖంగా తేడాలు చెబుతున్నారు. ఇదే వరసలో వైఎస్సార్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే.. వైఎస్సార్ కి ఇష్టులు అయిన వారికి జగన్ దుష్టుడుగా కనిపిస్తున్నాడు.
Also Read: ‘జమిలి’కి సై అంటున్న కేంద్రం.. 2022లో దేశవ్యాప్త ఎన్నికలు?
కారణం ఇదేనా?
ఇప్పుడు జగన్ ను విమర్శిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు సహా.. చాలా మంది నేతలకు వైఎస్సార్ మంచి మిత్రుడు. ఆయన వీరిని చేరదీసి మంత్రి పదవులు కట్టబెట్టారు. అలాంటి నేత కుమారుడిపై వీరు కోపంతో ఉండటానికి కారణం.. జగన్ వారికి అండగా ఉండకపోవడమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏపీలో కాంగ్రెస్ డీలా పడటంతో.. వైస్ కుమారుడు అనే కోణంలో కాంగ్రెస్ కేడర్ చాలా వరకు జగన్ వెంట నడిచింది. పలువురు నేతలను కూడా జగన్ తన పార్టీలోకి తీసుకున్నారు. అయితే.. మరికొందరు వస్తామని చెయ్యి చాచినా.. తలుపులు మూసేసారట జగన్. వారిలో రఘువీరా, సాకే శైలజానాథ్ లాంటి వారు ఉన్నారని అంటారు. స్థానిక సమీకరణలు కుదరకపోవడం, తండ్రితో పనిచేసిన వారిని ఎక్కువ మందిని తన వెంట తెచ్చుకోకూడదు అనే నియమం పెట్టుకోవడం వల్లే జగన్ వారిని పార్టీలోకి రానివ్వలేదు అంటారు. ఈ విధంగా తమను దూరం పెట్టడం వల్లే.. కాంగ్రెస్ సీనియర్లు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారనేని అభిప్రాయం ఉంది. అయితే.. వైఎస్ ను కీర్తిస్తూ.. జగన్ ను విమర్శించే కార్యక్రమం కొనసాగితే ఏపీ సీఎంకు ఇబ్బందే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఈ పరిస్థితిని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్